కడపలో పుర సమరానికి సమయం ఆసన్నమైంది. నేడు ఏపిలో నామినేషన్లు ఉపసం హరణ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని పురపాలక సంఘాల్లో గతేడాది మార్చిలో నిలిచిపోయిన ప్రక్రియ నుంచి ఎన్నికలను తిరిగి కొనసాగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నేడు, రేపు నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది. ఎన్నికలు జరుగతున్న నగరం, పట్టణాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మంతనాల ద్వారా అభ్యర్థులను పోటీలో నుంచి తప్పించి అధిక వార్డులను ఏకగ్రీవం చేసుకోవాలనేది అధికార పార్టీ వ్యూహం.


ఇందుకోసం నాయకులు ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడడంలేదు. మరోవైపు తమకు పట్టు ఉన్న స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తెదేపా పావులు కదుపుతోంది.. కడప, జమ్మలమడుగులో తమ పార్టీ అభ్యర్థులు బరిలో లేనిచోట స్వతంత్రులకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. పురపాలక సంఘాల్లోని పలు వార్డుల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు భాజపా సిద్ధమైంది. జిల్లాలో గతేడాది నామినేషన్‌ వేసిన అనంతరం 6 పురపాలక సంఘాల్లో ఒక్కో అభ్యర్థి చొప్పున మరణించిన విషయం తెలిసిందే. వీటిల్లో ఆయా పార్టీల నుంచి మరొక అభ్యర్థితో నామినేషన్‌ వేయించేందుకు ఎస్‌ఈసీ అవకాశం కల్పించారు.


మైదుకూరు పురపాలక సంఘంలో నామినేషన్‌ వేసిన తెదేపా అభ్యర్థులతో ఉపసంహరింపజేసేందుకు వైకాపా నాయకులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కొన్నిచోట్ల బెదిరింపులకు సైతం పాల్పడుతున్నట్లు సమాచారం.ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో మొత్తం 41 వార్డు కౌన్సిలర్‌ స్థానాలను ఎలాగైనా గెలుపొందాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పార్టీ శ్రేణులకు నొక్కి చెబుతున్నారు. ఇందుకోసం అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. తాజాగా తెదేపాకు చెందిన కీలక నాయకుడిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక వార్డులో వైకాపా ఏకగ్రీవం దాదాపు ఖాయం కాగా.. మరో అయిదుకుపైగా స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు వైకాపా నాయకులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.తమకు పోటీగా ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులతో వారు మంతనాలు సాగించి ఏకంగా ఇతరులకు తమ పార్టీ కండువా కప్పుతున్నారు. మరో వైపు బెట్టు చేస్తున్న వారికి తగిన మూల్యాన్ని చెల్లిస్తున్నారు. ఎస్ ఈసీ మొండి వైఖరి గెలుస్తుందా లేక వైసీపీ నేతల ఆగడాలు గెలుస్తాయ అనేది మరి కాసేపట్లో తేలనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: