ఎన్నికలు ఎపుడూ ప్రజల మనోభావాలను ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఎన్నికలు జరిగే చోట జనాలు రాజుని తరాజుని చేసిపారేస్తారు. నిర్ధాక్షిణ్యంగా కుర్చీ నుంచి దింపేస్తారు. అపుడు చండశాసనులు అయిన పాలకులు కూడా అతి సామాన్యులు అయిపోతారు. ఇది ఎక్కడైనా జరిగేదే. అలా అద్భుతాలను సృష్టించగల సత్తా ప్రజాస్వామ్యంలో పౌరులకు మాత్రమే ఉంది.

ఇదిలా ఉంటే దేశంలో ఇపుడు అయిదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో వేడి ఒక్క లెక్కన రాజుకుంది. దేశంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అసోం లకు ఎన్నికలు జరుగుతున్నా కూడా అందరి దృష్టి పశ్చిమ బెంగాల్  మీదనే ఉంది. ఇక్కడే బీజేపీ గురి కూడా ఉంది. ఎలాగైనా కూడా మమతా బెనర్జీని గద్దె దింపి తాము అక్కడ సింహాసనం అధిష్టించాలని బీజేపీ ఉవ్విళ్ళూరుతోంది.

ఇక బీజేపీకి పశ్చిమ బెంగాల్ అందుతుందా అన్నది పెద్ద ప్రశ్న. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఎలాగైనా మమతా దీదీని ఇంటికి పంపిస్తే దేశంలో కనుచూపు మేరలో ప్రధాని మోడీకి కానీ బీజేపీకి కానీ ఎదురు ఉండదు అంటున్నారు. ఎందుచేతనంటే కాంగ్రెస్ సహా మిగిలిన ప్రాంతీయ పార్టీలు అంత దూకుడుగా ఉండలేకపోతున్నాయి. పైగా వరస పరాజయాలతో అవి కృంగిపోతున్నాయి. అయితే బెంగాల్ లో మమత కనుక గెలిస్తే బీజేపీకి ఎదురు నిలవడం ఖాయమని అంటున్నారు.

మమత ఒక్కసారిగా జాతీయ స్థాయిలో హీరో అవుతారు అని కూడా చెబుతున్నారు. కకావికలమైన మూడవ కూటమికి ఆమె నాయకత్వం వహించినా ఆశ్చర్యం లేదని కూడా అంటున్నారు. మమత విజయం అంతటి ప్రకంపనలు సృష్టిస్తుంది అని విశ్లేషిస్తున్నారు. బెంగాల్ లో మమత ముచ్చటగా మూడవ సారి గెలిస్తే అది అతి పెద్ద విజయంగానే నమోదు అవుతుంది అని కూడా చెబుతున్నారు. మమతా బెనర్జీ మీద ఏకంగా బీజేపీ మొత్తం అగ్ర నాయకత్వం గురి పెట్టినా ఆమె వారిని  ఓడించి విజేత అయితే మాత్రం మోడీకి ఇక ఇబ్బంది అన్నది అపుడే మొదలవుతుంది అని కూడా అంటున్నారు. దేశంలో తృతీయ కూటమికి నాయకత్వం కూడా ఆమె వహిస్తారు అని చెబుతున్నారు. చూడాలి మరి ఆ అద్భుతం. జరుగుతుందా లేదా అన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: