ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. దశాబ్దకాలంగా తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ముఖ్యమంత్రి మమతాబెనర్జీ జోరుకు ఎట్టిపరిస్థితుల్లోనూ బ్రేక్ వేసి అధికారంలోకి రావాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. బెంగాల్ లో తాజాగా జరుగుతున్న ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు లింక్ ఉందని జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బీజేపీ అంటున్నారు. బిజెపి గత కొంత కాలంగా దక్షిణాదిపై పట్టు సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.

బెంగాల్లో ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి వస్తే దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లోనూ.. తమిళనాడులోనూ భవిష్యత్తులో బిజెపి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపక పోవచ్చు అని అంటున్నారు. అదే బెంగాల్ లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలితే ఆ పార్టీ వచ్చే ఎన్నికలకు ముందే ఏపీ లోను , అటు తమిళనాడులోను ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే దిశగా ఆలోచన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కేంద్రంలో రెండు సార్లు అధికారంలో ఉన్న బీజేపీ వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం అంత సులువు కాదు. ఈ క్ర‌మంలోనే బెంగాల్ రిజ‌ల్ట్ చూసుకున్నాకే ద‌క్షిణాదిలో పొత్తుల‌తో ముందుకు వెళ్లాలా ?  లేదా ? అన్న ఆలోచ‌న చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల‌తో పోలిస్తే 2019లో యూపీ లాంటి చోట్ల అనుకున్న స్థాయిలో ఫ‌లితాలు రాక‌పోయినా మిగిలిన రాష్ట్రాలు ఆదుకోవ‌డంతో ఆ పార్టీ ఎవ్వ‌రి స‌హ‌కారం లేకుండానే వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని బీజేపీ ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌లు ర‌చించేసింది. అయితే చాలా రాష్ట్రాల్లో గ‌తంతో పోలిస్తే వ్య‌తిరేక‌త పెరిగింది. అందుకే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల అవ‌స‌రం ఉందా ?  లేదా ? అన్న‌ది బెంగాల్‌, యూపీ ఎన్నిక‌లే డిసైడ్ చేయ‌నున్నాయి. ఒక వేళ బెంగాల్లో బీజేపీ రెండో స్థానంలో ఉన్నా యూపీ ఎన్నిక‌ల వ‌రకు వేచి చూసే ధోర‌ణితోనే ఉంటుంది. రెండు చోట్లా గెలిస్తే ఏపీలో టీడీపీ, వైసీపీల‌తో పొత్తు అన్న మాటే ఆ పార్టీ నుంచి రాదు.

రెండు చోట్లా ఫ‌లితం తేడా వ‌చ్చినా లేదా బెంగాల్లో ఓడి.. యూపీలో గెలిచినా బీజేపీ ద‌క్షిణాదిలో ప‌ట్టు కోసం ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోక త‌ప్ప‌దు. త‌మిళ‌నాడులో అన్నాడీఎంకేతో క‌లిసి నడుస్తోంది. ఏపీలో అప్ప‌టి రాజ‌కీయ అవ‌స‌రాల‌తో పాటు టీడీపీ, వైసీపీల‌లో ఏ పార్టీ బ‌లంగా ఉంది ?  ఏ పార్టీతో పొత్తు ఉంటే ఎక్కువ ల‌బ్ధి ఉంటుంద‌న్న ప్లాన్‌కు అనుగుణంగా ముందుకు వెళ్ల‌వ‌చ్చు. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీలో జ‌న‌సేన కాబ‌ట్టి బీజేపీతో క‌లిసుంది కాని... మిగిలిన పార్టీలు ఆ పార్టీతో పొత్తు అనే రిస్క్ చేసి నిండా మునిగిపోతాయా ? అన్న‌ది డౌటే ?


మరింత సమాచారం తెలుసుకోండి: