పుర‌పాల‌క సంఘ ఎన్నిక‌ల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దౌర్జ‌న్యాలు పెట్రేగిపోతున్నాయి. పోలీసుల అండ‌తో య‌ధేచ్ఛ‌గా ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చెల‌రేగిపోతున్నారు. ఎవ‌ర‌న్నా చూస్తారు.. ఏమ‌న్నా అనుకుంటారు.. అనే ఆలోచ‌న అస‌లే లేదు. అవ‌న్నీ ఎప్పుడో వ‌దిలేశారు. వార్డులు, డివిజ‌న్లు ఏక‌గ్రీవం కావాలంటే సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది.   సొంతపార్టీలో అసంతృప్తులు, రెబల్స్‌ బెడదను ఎదుర్కొంటూనే టీడీపీ అభ్యర్థులను తమవైపునకు తిప్పుకొని ఏకగ్రీవ ఎంపికల ద్వారా ఆదిలోనే బ‌ల‌ప‌డ‌దామ‌నే ఆలోచ‌న చేస్తున్నారు. అధికారపార్టీ పన్నాగాలను  అధిగమించి పార్టీ అభ్యర్థులతో సమరానికి దిగేందుకు  తెలుగుదేశం పార్టీ  నేతలు సన్నద్ధ‌మ‌య్యారు.

పురపాలక సంఘాల ఎన్నికల సమరంలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం బుధవారం సాయంత్రంతో ముగియనుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో అవకాశం ఉన్నంత‌వ‌ర‌కు  డివిజన్లు, వార్డులను ఏకగ్రీవంగా చేజిక్కించుకుని ఆరంభంలోనే టీడీపీని దెబ్బ‌తీయ‌డానికి పావులు క‌దుపుతున్నారు. అయితే ఒకటి రెండు చోట్ల మినహా మిగిలినచోట్ల అధికారపార్టీ కుయుక్తులు ఫలించడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడే స్వ‌యంగా రంగంలోకి దిగి అక్క‌డి ఎన్నిక‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారంటే అక్క‌డి ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అవ‌న్నీ కూడా ప్ర‌కాశం జిల్లాలోని పుర‌పాల‌క సంఘాలే.

ఒంగోలు న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లో వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 50 డివిజన్లలో నాలుగు డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు పరిశీలనలో తమ నామినేషన్లను కోల్పోయారు. మరో డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి రంగం నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. దీంతో అవసరమైన చోట జనసేనకు, వామపక్షాలకు మద్ధతిచ్చే దిశగా అడుగేస్తున్నారు. జనసేన మాత్రం అనధికారికంగా అంగీకారానికి వస్తున్నట్లు తెలిసింది. ఇక మంత్రి బాలినేని సారథ్యంలో వైసీపీ దూకుడుగా ఉంది. మేయరు అభ్యర్థి గంగాడ సుజాతను ఏకగ్రీవంగా 18వ వార్డు నుంచి గెలిపించే ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారపార్టీ ప్రలోభాలు ఈ విషయంలో పెద్దగా ఫలించకపోవచ్చని, ఏకగ్రీవమయ్యే డివిజన్లసంఖ్య పెద్దగా ఉండకపోవచ్చని అంచనా.


మరింత సమాచారం తెలుసుకోండి: