విశాఖ కార్పొరేషన్ కి బీజేపీకి ఎంతో అనుబంధం ఉంది. మామూలు మునిసిపాలిటీగా ఉన్న విశాఖను 1979లో కార్పొరేషన్ చేశారు. ఆ తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో అక్కడ జెందా ఎగరేసింది బీజేపీనే. ఒక విధంగా చెప్పాలంటే దక్షిణాదిన మొట్ట మొదటి జెండా విశాఖలోనే బీజేపీ ఎగరేసింది. తొలి మేయర్ ఎన్ ఎస్ ఎన్ రెడ్డి బీజేపీ నుంచి గెలిచి సత్తా చాటారు.

ఇక ఆ తరువాత నుంచి బీజేపీ ఎపుడూ మేయర్ సీటుని గెలుచుకోలేదు. 1987 ఎన్నికలో తెలుగుదేశం గెలిస్తే ఆ తరువాత వచ్చిన మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయపతాక ఎగరవేసింది. అయితే బీజేపీకి విశాఖ సిటీలో బలం బాగానే ఉంది. బీజేపీ మేయర్ సీటుని గెలిచేటంత బలం తెచ్చుకోకపోయినా కూడా కొన్ని వార్డుల్లో తన పట్టుని ఇప్పటికీ  కొనసాగిస్తూ వస్తోంది.

అలా చూసుకుంటే బీజేపీకి ఎవరితో పొత్తు ఉన్నా లేకపోయినా నాలుగు సీట్లు మాత్రం ఖాయమన్న మాట ఉంది. అయితే ఈసారి ఎన్నికలకు ముందు వరకూ బీజేపీకి ఆ సానుకూలత ఉంది. పైగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న జనసేన మిత్రపక్షంగా ఉంది. దాంతో బీజేపీ జనసేన కూటమి కచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది సీట్లు గెలుచుకుంటారు అన్న టాక్ అయితే వచ్చింది.

అయితే అనూహ్యంగా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం విశాఖలో చెలరేగడంతో బీజేపీ మొదటి ముద్దాయి అయిపోయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉక్కుని ప్రైవేట్ పరం చేసేందుకు పావులు కదపడంతో ఆ ప్రభావం బీజేపీ మీద గట్టిగా పడుతోంది. ఇక బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేనకు కూడా ఇది ఇబ్బందికరంగా మారుతోంది. అయితే ఉక్కు సెగ ఎంత, దాని ప్రభావం ఎవరి మీద ఎంత శాతం ఉంటుంది అన్నది ఇప్పటికీ కచ్చితంగా తేలని అంశం. ఒక వేళ ఉక్కు ప్రభావం కనుక అనుకున్నంతగా లేకపోతే మాత్రం ఈ కూటమి కచ్చితంగా అర డజన్ సీట్లకు తక్కువ కాకుండా గెలుచుకుంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.





మరింత సమాచారం తెలుసుకోండి: