ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు హ‌స్తినాపురానికి వెళ్ల‌నున్నారు. రాష్ట్రంలో కొన్ని కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్న త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఫోన్ వ‌చ్చిన‌ట్లు తెలిసింది. వాస్త‌వానికి జ‌గ‌న్‌కు ఇప్ప‌ట్లో ఢిల్లీ వెళ్లే ఉద్దేశం లేదు. విశాఖ ప‌ట్నం ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌, పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు త‌గ్గింపు, తిరుప‌లి లోక్‌స‌భ‌కు ఉప ఎన్నిక‌, ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌మావేశం ర‌ద్దు కావ‌డం వంటి పరిణామాల మధ్య ఆయన బుధవారం ఢిల్లీ విమానం ఎక్కబోతున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోను, మ‌రికొంద‌రు కేంద్ర మంత్రుల‌తోను ముఖ్య‌మంత్రి భేటీ కానున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

వాస్త‌వానికి ఇప్పట్లో ఢిల్లీ వెళ్లాలనే ఆలోచన ముఖ్యమంత్రికి లేద‌ని వైసీపీ వ‌ర్గాలు తెలిపాయి. ఏదైనా ఉన్నా మున్సిపల్ ఎన్నికల ఫ‌లితాలు వ‌చ్చిన ‌త‌ర్వాతే అనుకున్నారు.  అనూహ్యంగా కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రికి ఎన్డీఏ పెద్దల నుంచి బుధవారం అందుబాటులో ఉండాలంటూ డిల్లీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పేషీ అధికారుల‌ను జ‌గ‌న్ బుధ‌వారం షెడ్యూల్‌ను మార్చాల‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది.

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్ర‌యివేటీకరణ వ్యవహారం, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వంటి అంశాలనూ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది. జీఎస్టీ బకాయిలు, పోలవరం నిర్మాణ వ్యయానికి సంబంధించిన లెక్కలను ఆయన వివరిస్తారని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం చెల్లింపు మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని జ‌గ‌న్ కోర‌నున్నారు. విశాఖ‌ప‌ట్నం ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌రిస్తే దాన్ని ఏపీకి కేటాయించాల‌ని, అప్పుడు దాన్ని ఎలా లాభాల‌బాట ప‌ట్టించాలో ఆలోచించ‌వ‌చ్చంటూ కేంద్రానికి ఒక ప్ర‌తిపాద‌న పెట్టే అవ‌కాశం కూడా క‌న‌ప‌డుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏ పెద్దలే ఆయనను ఢిల్లీకి రావాలంటూ సూచించడం.. జగన్ పర్యటన ప్రధానంగా రాజకీయ కారణాలతోనే ఉండొచ్చని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీయేలో చేర‌బోతోందంటూ గ‌తంలో విస్త్ర‌తంగా ప్ర‌చారం జ‌రిగింది. ఈసారికూడా దానిపై చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలంటున్నాయికానీ ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు మాత్రం దీన్ని కొట్టేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: