తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ MLC స్థానాలకు మార్చి 14 పోలింగ్ జరగబోతోంది. ఆరు ఉమ్మడి జిల్లాలకు విస్తరించిన ఈ రెండు నియోజకవర్గాల్లో దాదాపు 10 లక్షల మంది గ్రాడ్యుయేట్ హోల్డర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీళ్ళల్లో సగం మందికి పైగా మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ప్రకారం ఓట్లు వేయాల్సి రావడంతో చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంది. పోటీ చేస్తున్న వారిలో ఒక్కరికే కాకుండా… ఒకరికన్నా మించి లేదా అందరికీ కూడా తమ ప్రాధాన్యత ప్రకారం అంకెల రూపంలో ఓట్లు వేయడానికి ఓటర్ కు అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా పెద్దదిగానే ఉండటంతో బ్యాలెట్ పేపర్ భారీ సైజులోనే ఉండే అవకాశముంది.

మీరు ఓటు వేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

1) తమకు నచ్చిన అభ్యర్థికి మొదటి నెంబర్ ఓటు వేసి… మిగతా వారికి కూడా వరుసగా నెంబర్స్ వేసే అవకాశం మీకు ఉంది. లేదా వేయకపోవచ్చు కూడా

2) ఉదాహరణకు మీకు నచ్చిన వ్యక్తి 35వ నెంబర్ లో ఉన్నాడనుకుంటే… ముందుగా అతని పేరు పక్కన 1 నెంబర్ వేయాలి… ఆ తర్వాత రెండో ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి నెంబర్ 5లో ఉందనుకోండి… అతని పేరు పక్కన రెండో నెంబర్ వేయాలి. ఇలా బ్యాలెట్ పేపర్ పై మనకు ఇష్టమొచ్చిన వాళ్ళందరికీ మీ ప్రాధాన్యత ప్రకారం ఓటు వేయొచ్చు.

3) అందరికీ ఒకటే నెంబర్ వేయకూడదు. 1 నుంచి 2,3,4 ఇలా మాత్రమే ఓటు వేయాలి. సాధరణ ఎన్నికలకు లాగా స్వస్తిక్ మార్క్ వేయడం ఉండదు.

4) మీరు ప్రాధాన్యత ప్రకారం ఓటు వేసేటప్పుడు ఎక్కడా కూడా సీరియల్ నెంబర్ మిస్ చేయొద్దు. ఒక వేళ మిస్ అయితే… సక్రమంగా ఉన్నంత వరకే మీ ఓట్లను లెక్కలోకి తీసుకుంటారు.

5) బ్యాలెట్ పేపరులో నోటా ఓటు ఉండదు

6) భారత ఎన్నికల సంఘా జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డు లేదా ఎలక్షన్ కమిషన్ అనుమతించిన ఇతర డాక్యుమెంట్లను చూపి ఓటు వేయొచ్చు

ఏ ఓట్లు చెల్లుతాయి ?

1) మీ ప్రాధాన్యతా క్రమాన్నిబట్టి 1,2,3,4,5… ఇలా అంకెలలో మాత్రమే మీ ఓటు వేయాలి

2) ఒక అభ్యర్థికి ఒక ప్రాధాన్యత మాత్రమే ఇవ్వాలి… రెండు నెంబర్లు వేస్తే చెల్లదు

3) బ్యాలెట్ పేపర్ లో ఉన్న వాళ్ళల్లో ఒక్కరికి మాత్రమే మొదటి ప్రాధాన్యత 1 అనేది ఇవ్వాలి. అందరికీ ఇవ్వకూడదు

4) బ్యాలెట్ పేపర్లలో ఉన్న అభ్యర్థులందరికీ ప్రాధాన్యత ఇవ్వదలిస్తే… వారి పేర్ల పక్కన నెంబర్ వేయాలి

5) అభ్యర్థి పేరు, ఫోటో పక్కన ఉన్న గడి లోపలే … బోర్డర్ దాటకుండా సంఖ్య లేదా అంకె వేయాలి ( అభ్యర్థులకు ఎలాంటి పార్టీ గుర్తులు అక్కడ ఉండవు )

6) 1,2,3,4,5… లేదా… రోమన్ అంకెలలో కూడా వేయొచ్చు

7) పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్ను మాత్రమే ఉపయోగించి మీ అంకెలు, సంఖ్యలు వేయాలి

ఏ ఓట్లు చెల్లవు ?

1) బ్యాలెట్ పేపర్ పై వేలి ముద్ర లేదా సంతకం, పేర్లు…ఇతర ఏ రాతలు రాసినా మీ ఓటు చెల్లదు

2) రైట్ గుర్తు, తప్పు గుర్తు… ఇతరత్రా ఏ బొమ్మలు వేయరాదు

3) మొదటి ప్రాధాన్యత  1 నెంబర్ ఇవ్వకుండా 2,3,4… ఇలా మీరు ఎన్ని ఇచ్చినా మీ ఓటును లెక్కలోకి తీసుకోరు.

4) ప్రాధాన్యత క్రమాన్ని అక్షరాల్లో రాయడం, కొన్ని అంకెల్లో వేయడం… మరికొన్ని అక్షరాల్లో రాయడం లాంటి గందరగోళ పనులు చేయరాదు

5) ఒకే అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యత నెంబర్స్ ఇవ్వరాదు

6) ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ను తప్ప… మీ పెన్ను లేదా పెన్సిల్ లాంటివి ఉపయోగించరాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: