వైసీపీ నేత‌లు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు 90 శాతం మేర‌కు.. పంచాయ‌తీల‌ను ఏక‌గ్రీవం చేయాల‌ని అనుకున్నారు. అయితే.. అది సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు సీఎం జ‌గ‌న్ నుంచి అంద‌రికీ అక్షింత‌లు ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో వైసీపీ నాయ‌కులు హ‌ద్దులు మీరుతున్నార‌నే వాద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. వాస్త‌వానికి పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిశాయి. నాలుగు ద‌శ‌ల్లో జ‌రిగిన ఈ ఎన్నిక‌లు ముగిశాయి. అయితే.. ఇంకా ప‌ల్లెల్లో మాత్రం ఈ ఎన్నిక‌ల వేడి కొన‌సాగుతూనే ఉంది. ఎక్క‌డిక‌క్క‌డ అధికార వైసీపీ నేత‌లు దూకుడు గానే ఉన్నారు.

త‌మ‌కు ఓట్లు వేయలేద‌నే అక్క‌సుతోపాటు టీడీపీకి ఓట్లు వేశారనే ఆగ్ర‌హంతో అధికార‌ పార్టీ నాయ‌కులు రెచ్చిపోతున్నారు.  పైగా.. అధికారులు కూడా వైసీపీ నాయ‌కుల‌కు స‌హ‌క‌రిస్తుండ‌డం మ‌రింత వివాదంగా మారింది. ఉదాహ‌ర‌ణ‌కు గుంటూరు జిల్లాను తీసుకుంటే.. జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ నేతల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పమిడిపాడు పంచాయ‌తీలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించలేదనే అక్కసుతో 150 మంది వృద్ధులు, వికలాంగుల పింఛన్లను వైసీపీ నేతలు నిలిపివేశారు. దీనిపై అధికారుల‌ను అడిగినా స్పంద‌న రాక‌పోగా.. త‌మ‌కు తెలియ‌ద‌ని స‌మాధానం చెబుతున్నారు.

ఇక‌, కృష్ణాజిల్లా మైలవ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గంప‌ల గూడెం ప‌రిధిలోనూ పింఛ‌న్ల‌ను నిలిపివేయిం చారు వైసీపీ నాయ‌కులు. కొంద‌రిని రోజువారి కూలి ప‌నులు చేయ‌కుండా కూడా అడ్డుకున్నారని తెలిసిం ది. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని కార్మికులు వైసీపీ నేత‌ల జులుంతో అల్లాడిపోతున్నారు. మ‌రోవైపు గుడివాడ‌లోని కొన్ని పంచాయ‌తీల్లోనూ ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, తూర్పు‌లోని జ‌గ్గం పేట నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నాయ‌కులు.. రాత్రి వేళ‌ల్లో గ్రామాల‌కు విద్యుత్‌ను నిలిపివేయిస్తున్నార‌ని ఫిర్యాదులు అంద‌డం గ‌మ‌నార్హం.

అదే స‌మ‌యంలో క‌డ‌ప‌లో అయితే.. కొన్ని గ్రామాల్లో పింఛ‌న్‌తో పాటు.. రేష‌న్ కూడా ఇవ్వ‌డం ఆపేశార‌ని తెలుస్తోంది. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు.. గ‌డిచిపోయిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఓటు వేయ‌లేద‌ని.. వైసీపీ నాయ‌కులు రెచ్చిపోతుండ‌డం ప్ర‌స్తుతం గ‌గ్గోలు పుట్టిస్తోంది. అయితే.. ఇదంతా స్వామి భ‌క్తి కోస‌మేన‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం., మ‌రి ఇది కొన‌సాగితే.. రేపు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: