కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి . 6 వ తరగతి నుండి 10వ తరగతి  విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కాగా 1నుండి 5 తరగతుల విద్యార్థులకు ఇంకా బడిగంట మోగలేదు . దాంతో ఆన్లైన్ క్లాసులనే నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పాటాలు వినేందుకు కష్టపడుతూనే ఉన్నారు . కొంత‌మంది విద్యార్థులు ఆండ్రాయిడ్ ఫోన్ లు కొనుక్కునే స్థోమ‌త లేక ఇబ్బంది ప‌డుతుంటే మరి కొంత మంది సిగ్న‌ల్ లేక ఇబ్బందులు ప‌డుతున్నారు . దాంతో సిగ్న‌ల్ కోసం ఇల్లు ఎక్క‌డాలు.. కిలో మీట‌ర్ల మేర‌ దూరం ప్ర‌యాణించి సిగ్న‌ల్ వ‌చ్చే ప్రాంతానికి వెళ్ల‌డం చేస్తున్నారు . తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ లో చ‌దువుల త‌ల్లికి అలాంటి ప‌రిస్థితే ఏర్ప‌డింది. ఆ అమ్మాయి పేరు కూడా స‌ర‌స్వ‌తి కావ‌డం విశేషం పేరుకు త‌గ్గ‌ట్టుగానే స‌రస్వ‌తి చ‌దువు కోసం ఇంటి నుండి 5 కిమీ దూరం ప్ర‌యాణించి ఆన్లైన్ క్లాస్ లు వింటోంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే ....కొమురం భీం జిల్లా తిర్యాణి మండలం మొర్రిగూడ లోని గిరిజ‌న కుటుంబంలోని స‌ర‌స్వ‌తి అనే  విద్యార్థిని మంచిర్యాల జిల్లా తాండూర్ మండ‌లంలోని ఓ ప్రయివేట్ పాఠశాల‌లో ఒక‌టో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. లాక్ డౌన్ తో పాఠ‌శాల‌లు తెరుచుకోకపోవ‌డంతో ఆన్లైన్ క్లాసుల‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే గిరిజ‌న గూడెంలో సెల్ ఫోన్ సిగ్న‌ల్ రాక క్లాసులు మిస్ అవుతుండ‌టంతో త‌న తండ్రితో క‌లిసి రోజూ ఇంటి నుండి ఐదు కిలో మీట‌ర్ల దూరం ప్ర‌యాణించి క్లాసుల‌ను వింటోంది. ఈ దృశ్యాన్ని ఓ వ్య‌క్తి ఫోటో తీయ‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజ‌న్ లు పేరుకు త‌గ్గ‌ట్టుగా చ‌దువుల త‌ల్లి క‌ష్ట‌ప‌డుతుంద‌ని కామెంట్స్ పెడుతున్నారు. ‌మ‌రి కొంత మంది స‌ర‌స్వ‌తి క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం భ‌విష్య‌త్తులో ఉంటుంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: