ప్ర‌జ‌లు ఓట్లేసి గెలిపించ‌డంతోపాటు బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విని కూడా క‌ట్ట‌బెట్టారు. నిస్వార్థంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పాటుప‌డ‌మ‌ని కోరారు. వాట‌న్నింటినీ వ‌దిలేసి త‌న సొంత కార్యాలు చ‌క్క‌బెట్టుకోవ‌డానికి అల‌వాటుప‌డ్డ ప్ర‌జాప్ర‌తినిదులు విలువ‌లు దిగ‌జారిపోయేలా చేస్తున్నారు. ఉద్యోగం ఇప్పించాలంటూ కోరిన మ‌హిళ‌ను లోబ‌ర్చుకొని త‌న కోరిక‌లు తీర్చుకున్న మంత్రి ఉదంతంగా తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అత‌డిని వెంట‌నే మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించాలంటూ ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌కు దిగాయి.

భార‌తీయ జ‌న‌తాపార్టీకి చెందిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంలో  రమేశ్ జర్కిహోలి జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.
ఆయ‌న‌పై బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త దినేశ్ కుళ్లహళ్లి  సిటీ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. స‌ద‌రు మంత్రి  ఓ మహిళ(25)ను చంపేస్తానని బెదిరిస్తున్నారని, కర్ణాటక పవర్ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ  మంత్రి ఆ మహిళతో కలిసున్న వీడియోలు, ఆడియోలు సాక్ష్యాలుగా అందించారు.

ఆ వీడియోలు క‌ర్ణాట‌క రాజ‌కీయాల‌ను కుదిపేశాయి.  మీడియాలో త‌న‌పై వస్తోన్న వార్తలు చూసి షాకయ్యాన‌ని, ఆ మ‌హిళ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని, అవి న‌కిలీ వీడియోల‌ని, ప్ర‌త్య‌ర్థుల రాజ‌కీయ కుట్ర అని ష‌రామాములుగానే మంత్రి ఆరోపించారు. తాను మంత్రి పదవికి  రాజీనామా చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప‌తో మాట్లాడ‌న‌ని, ఆ వీడియోల గుట్టు ఏమిటో తేల్చాల్సిందిగా కోరిన‌ట్లు మంత్రి వివ‌ర‌ణ ఇచ్చారు. ఇదంతా రాజ‌కీయ గిమ్మ‌క్క‌ని, త‌న‌ను, త‌న కుటుంబాన్ని అప్ర‌తిష్టపాల్జేసేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ని ఆరోపించారు. 21 సంవ‌త్స‌రాలుగా రాజ‌కీయాల్లో ఉన్న త‌న‌పై ఏనాడూ ఆరోప‌ణ‌లు రాలేద‌న్నారు. ఈ వ్య‌వ‌హారంపై బెంగళూరు పోలీసులు ఆచితూచి అడుగులేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ గా మారిన ఆ వీడియో కుబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ లో చిత్రీకరించినట్లు తెలియడంలో, ఆ స్టేషన్ ప‌రిధిలోనే కేసు నమోదు చేయాల్సిందిగా పోలీస్ క‌మిష‌న‌ర్ ఆదేశించారు. వీడియోలు లీకైన త‌ర్వాత కొద్ది గంట‌ల‌పాటు మంత్రి ఎవ‌రికీ అందుబాటులో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత తాను మైసూరులో ఉన్నానంటూ ప్ర‌క‌టించి వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: