రాష్ట్రంలోని సచివాలయ వాలంటీర్లు.. మున్సిపల్ ఎన్నికల విధులకు దూరంగా ఉండాలా, లేక వారి మానాన వారు ప్రభుత్వం అప్పజెప్పిన పనులు చేసుకోవాలా అనే విషయంపై నేడు హైకోర్టు క్లారిటీ ఇవ్వబోతోంది. సాక్షాత్తూ ఎన్నికల కమిషనరే వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని, వారి వద్దనుంచి సెల్ ఫోన్లు కూడా తీసేసుకోవాలని చెప్పిన సందర్భంలో.. పలు వ్యాజ్యాలు కోర్టు ముందుకు వచ్చాయి. దీనిపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు నేడు తీర్పునివ్వబోతోంది.

మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వాలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలన్న ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులను సవాలు‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టులో వాదనలు ముగిశాయి. మున్సిపల్‌ ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా ఉంచేలా ఎన్నికల కమిషషన్ ను ఆదేశించాలంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో, వాలంటీర్లపై విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కూడా వాదనలు ముగిశాయి.

వాలంటీర్లు ఓటర్‌ స్లిప్పులను పంచుతున్నారన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని హైకోర్టులో వాదించారు ప్రభుత్వం తరపు న్యాయవాది. బ్లాక్‌ స్థాయి అధికారులే ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేస్తున్నారని, వాలంటీర్లకు ఎన్నికలతో సంబంధం ఉండదని చెప్పారు. వాలంటీర్ల వద్ద కేవలం పథకాల లబ్ధిదారుల వివరాలు మాత్రమే ఉంటాయని, పౌరులందరి సమాచారం ఉండదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాలంటీర్లకు మొబైల్‌ ఫోన్లు ముఖ్యమని, వాటిలోనే లబ్ధిదారుల సమాచారం ఉంటుందన్నారు. మొబైల్‌ ఫోన్లు లేకుండా వారు సంక్షేమ పథకాలను అమలు చేయలేరని తెలిపారు.

ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది, వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతూ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించారు. వాలంటీర్ల తీరుపై ఫిర్యాదులు వచ్చాయని అందుకే ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇతర పార్టీల సానుభూతిపరులకు వాలంటీర్లు ఓటర్‌ స్లిప్పులు ఇవ్వడం లేదన్నారు. పౌరుల సమాచారం మొత్తం వలంటీర్ల వద్ద ఉంటుందని వివరించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మూడు వ్యాజ్యాల్లో నేడు తుది ఉత్తర్వులిస్తామని ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: