ప్రైవేటీకరణతో దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టిస్తామంటున్న ప్రధాని నరేంద్ర మోదీ.. తాజాగా ఓడరేవుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై భారత్ లోని ప్రధాన ఓడరేవులన్నీ పీపీఏ పద్ధతిలో ప్రైవేటు కంపెనీలకు భాగస్వామ్యం కల్పించబోతున్నాయి. దీని ద్వారా మొత్తం 400 ప్రాజెక్ట్ లు చేపట్టి 2.25లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరిస్తామంటున్నారు ప్రధాని మోదీ. 2024కల్లా ఈ ప్రాజెక్ట్ లు పూర్తి కావాలనే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. పరోక్షంగా దీని ద్వారా 20లక్షలమందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.
 
మారిటైం ఇండియా సమ్మిట్‌-2021 లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు కేంద్ర నౌకాయాన, జల రవాణాశాఖ కార్యదర్శి సంజీవ్‌ రంజన్. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న పోర్టుల్లోని 39 బెర్తులను ఈ ఏడాది ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి అప్పగించబోతున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం పోర్టు సహా.. ఇప్పటివరకూ దేశంలోని పోర్టులన్నీ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అయితే, ఈ ట్రస్టులకు అధికారాలు పరిమితంగా ఉండటంతో కేంద్రం జారీ చేసే ఉత్తర్వులు, విధాన నిర్ణయాలనే ఇవి అమలు చేయాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో పోర్టులకు స్వతంత్రత కల్పిస్తూ కేంద్రం మేజర్‌ పోర్టుల అథారిటీ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం.. పోర్టుల్లోని ప్రాజెక్టులను పీపీపీ పద్ధతిలో అప్పగించే అధికారం అథారిటీకి కల్పిస్తోంది. భూమి, మౌలిక వసతులు మాత్రం పోర్టు యాజమాన్యం కింద ఉండగా.. దాని నిర్వహణ  కార్యకలాపాలన్నీ ప్రైవేటు భాగస్వామి చేతుల్లోకి వెళ్తాయి. విశాఖపట్నం సహా దేశంలోని 10 ప్రధాన పోర్టులు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

"సుదీర్ఘ సాగరతీరం, శ్రమించే మానవ వనరులు ప్రపంచ పెట్టుబడిదారుల కోసం ఎదురుచూస్తున్నాయి. మా పోర్టుల్లో, మా ప్రజలపై పెట్టుబడి పెట్టండి. భారత్‌ను మీ గమ్యస్థానంగా మార్చుకోండి. భారతీయ పోర్టులను మీవిగా భావించి వర్తక, వాణిజ్యాలు చేపట్టండి..."అంటూ మారిటైమ్ ఇండియా సమ్మిట్ లో ప్రసంగించిన మోదీ.. ప్రైవేటుకి గేట్లు బార్లా తెరిచినట్టు అర్థమవుతోంది. 2016లో ప్రారంభించిన సాగర్‌మాల ప్రాజెక్టు కింద 2035 నాటికి రూ.6 లక్షల కోట్లతో అభివృద్ధి చేయడానికి అనువైన 574 ప్రాజెక్టులను గుర్తించామని, 2022 నాటికి తూర్పు, పశ్చిమతీరం పొడవునా నౌకా మరమ్మతు క్లస్టర్లు అభివృద్ధి చేస్తామని చెప్పారాయన. పోర్టుల ప్రాజెక్టుల్లో మూడు లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని భరోసా ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: