పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు తేడా కొట్టినా, మున్సిపాల్టీల విషయంలో టీడీపీ గట్టి నమ్మకం పెట్టుకుంది. కార్యకర్తలు, నాయకుల ధీమా ఎలా ఉందో తెలియదు కానీ, చంద్రబాబు మాత్రం పురపాలికల్లో టీడీపీ జెండా ఎగరేస్తామంటూ గట్టిగా చెబుతున్నారు. ఇటీవలే పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది టీడీపీ. ఇప్పుడు కొత్తగా ఆస్తి పన్ను తగ్గించే విషయంలో చంద్రబాబు మరో ప్రకటన ఇచ్చారు. టీడీపీ గెలిచిన పురపాలక, నగర పాలక సంస్థల్లో ఆస్తి పన్ను తగ్గిస్తూ కౌన్సిల్‌ మొదటి సమావేశంలోనే తీర్మానిస్తామని చెప్పారు చంద్రబాబు.

ఏపీలోని పట్టణాలు, నగరాల్లో ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్టర్డ్‌ విలువ ఆధారంగా ఆస్తి పన్ను భారీగా పెంచేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రలను అడ్డుకుంటామని అన్నారు చంద్రబాబు. పురపాలక ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే ప్రజలపై పెనుభారం పడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు చేస్తుండగా, రిజిస్ట్రేషన్‌ విలువ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను పెరిగేలా జగన్‌ చట్టం తీసుకొచ్చారని విమర్శించారు బాబు. రాష్ట్ర ప్రభుత్వం రుణ పరిమితి పెంచుకోవడానికి ప్రజలపై భారం వేయడం సిగ్గుచేటని అన్నారాయన. గతంలో పన్ను వేయని భవనాలు, ఖాళీ స్థలాలకు కొత్త విధానంలో రిజిస్టర్డ్‌ విలువ ఆధారంగా పన్ను వేసేలా వైసీపీ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిందని విమర్శించారు చంద్రబాబు. పేద, మధ్యతరగతి ప్రజలు కూడా రిజిస్టర్డ్‌ విలువ ఆధారంగా పన్ను చెల్లించేలా చట్టం తేవడం ప్రజలను వేధించడమేనని అన్నారు చంద్రబాబు.

ఆస్తి పన్ను పెంపుతో ప్రజలపై వైసీపీ ప్రభుత్వం ఎక్కడలేని భారం మోపుతోందని అన్న చంద్రబాబు.. తమ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. తొలి కౌన్సిల్ లోనే ఆస్తి పన్ను తగ్గించేలా తీర్మానం చేపడతామన్నారు. ఇక పురపోరుకోసం ప్రచార రంగంలోకి దిగిన బాబు, ఈ నెల 4న కర్నూలు, 5న చిత్తూరు, 6న విశాఖ, 7న విజయవాడ, ఎనిమిదో తేదీన గుంటూరులో పర్యటించబోతున్నారు. టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ రోడ్ షో లలో పాల్గొంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: