భారత్ లో ఇప్పటికే తొలిదశ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయింది. రెండో డోసు కూడా మొదలైంది. సరిగ్గా 28రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలని ఇప్పటికే వైద్య అధికారులు ప్రకటించారు. అలా తీసుకోకపోతే టీకా తీసుకున్న  ఫలితం ఉండదని హెచ్చరిస్తున్నారు. కచ్చితంగా రెండు డోసులు కొవిడ్ టీకా తీసుకుంటేనే దాని ద్వారా కరోనా నియంత్రించ వచ్చని చెబుతున్నారు.

కొవిడ్‌ నియంత్రణకు టీకా రెండో డోసు తీసుకోవడం తప్పనిసరని.. దాన్ని ఎవ్వరూ మరిచిపోవద్దని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ పేర్కొన్నారు. ఒక డోసు వేయించుకున్నాం ఇంకేం కాదులే అనుకోవద్దని చెప్పారు. రెండు డోసులు వేయించుకున్న తర్వాతే కరోనా వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుందని, ప్రతి ఒక్కరూ మొదటి డోసు వేయించుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్‌  తీసుకోవాలని చెప్పారు. రెండో డోసు తీసుకోనివారికి రక్షణ ఉండదని పేర్కొన్నారాయన.

28రోజుల తర్వాత రెండోడోసు తీసుకోకపోతే..?
రెండో డోస్‌ నాలుగు నుంచి ఆరు వారాల్లోపు తీసుకోవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ చెప్పారు. వ్యాక్సిన్లకు డీజీసీఏ అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చేటప్పుడు నాలుగు నుంచి ఆరు వారాల తేడాతో రెండో డోసు ఇవ్వొచ్చని చెప్పిందని, అందువల్ల 29వ రోజు మలి డోసు తీసుకోలేకపోయిన వారు ఆ తర్వాత రెండు వారాల్లోపు తీసుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు కొవాక్సిన్ తీసుకోవాలా, కొవిషీల్డ్ తీసుకోవాలా అనే ఛాయిస్ ఎవరికీ లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏ వ్యాక్సిన్‌ తీసుకోవాలో ఎంపిక చేసుకునే సౌలభ్యం ఎవరికీ లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. టీకా పంపిణీ ప్రక్రియ కొవిన్‌ యాప్ ద్వారా జరుగుతుందని పేర్కొంది. సుప్రీంకోర్టులో నేటి నుంచి న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి వ్యాక్సిన్‌ను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉందనే వార్తలు రావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపై స్పందించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: