మోడీ, కేసీఆర్, జగన్‌.. ఈ పాలకులంతా.. ఎవరి స్టయిల్లో వాళ్లు సామాన్యులను బాదేస్తున్నారు. సామాన్యుడి బతికే పరిస్థితులు కనిపించడం లేదు. పెట్రోలు ధరలు మండిపోతున్నాయి. గ్యాస్ బండ గుది బండగా మారింది. వంట నూనెలు మంటపెడుతున్నాయి. సరుకుల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్యుడి బతుకు దుర్భరం అవుతోంది. ఏంటీ రేట్లు.. ఈ రేట్లతో ఎలా బతికేది అంటూ సామాన్యుడు జేబు చేతబట్టుకుని ప్రశ్నిస్తున్నాడు.


ఒకరి తర్వాత ఒకరు ఈ పాలకులు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర వస్తువులు.. వీటిపై మంటగా మారిన పెట్రో ధరలు.. ఆపై వంటగ్యాస్ ధరలు సామాన్యులను నిద్రకు దూరం చేస్తున్నాయి. అసలే కరోనా దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జనం ఈ ధరల దెబ్బకి మూర్చపోతున్నారు. ఉన్నవాడు కాస్త బాగానే ఉన్నాడు.. కానీ.. పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు.


పెట్రో ఉత్పత్తుల రేట్లు పెరిగితే.. దాని ప్రభావం సరుకు రవాణా లారీలు, గూడ్సు రైళ్లు, ప్రజా రవాణా వ్యవస్థపై పడుతుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థలో అన్నింటి ధరలు పెరుగుతాయి. మోడీ సర్కారు రేట్లు పెంచుకునే అధికారం పెట్రో కంపెనీలకు అప్పగించేసరికి వారు రోజూ రేట్లు పెంచుతూ చుక్కలు చూపెడుతున్నారు. సంచి పట్టుకుని మార్కెట్‌కు వెళ్తే ఏ వస్తువు కొనాలన్నా ధరలు చుక్కలనంటున్నాయి.


నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నడూ లేనంతగా ఎగిసిపడుతున్నాయి. నిత్యం ఉపయోగించే వివిధ రకాల పప్పుల ధరలు వంద రూపాయల నుంచి 130 వరకు పెరిగాయి. చివరకు చింతపండు ధర కూడా కేజీ 300 రూపాయల వరకు వెళ్లింది. రిఫైన్డ్, సన్ ఫ్లవర్ నూనెల ధరలు 130 నుంచి 150 వరకు చేరుకున్నాయి. ఈ రేట్లతో ఎలా బతకాలని చిరుద్యోగులు, కూలీలు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కాస్త ఈ రేట్లు కాస్త కంట్రోల్ చేయండ్రా బాబూ అంటూ పాలకులను వేడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: