పుర‌పాల‌క సంఘాల్లో ఎలాగైనా పాగా వేయాలి.. మ‌న పార్టీ జెండానే ఎగ‌రాలి.. అందుకు ఏమైనా చేయాలి.. చైర్మ‌న్ స్థానంలో మ‌న పార్టీవారే కూర్చోవాలి.. అందుక‌వ‌స‌ర‌మైన అన్నిర‌కాల ఉపాయాలు ప్ర‌యోగించండి.. నామినేషన్ల ఉపసంహరణకు బుధివారం తుది గడువు కావడంతో ఈలోగా ప్రత్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా  చూడండంటూ అధికార పార్టీ నేత‌లు స్థానిక నేత‌ల‌కు హుకుం జారీచేశారు. దీంతో వారంతా ఆ ప్ర‌య‌త్నాల్లోనే ఉన్నారు.

‘‘గెలిచేది మేమే.. అధికారం మాదే.. మధ్యలో మీరేంటి!?’’ అంటూ వీరంతా బెదిరింపులకు దిగారు. పై నుంచి అండ ఉండ‌టంతో కిందిస్థాయిలో చెల‌రేగిపోతుత‌న్నారు. నామినేషన్లు ఉపసంహరించుకుంటే రాబోయే మూడేళ్లలో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా  ఇస్తున్నారు.

నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట పుర‌పాల‌క సంఘాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రత్యర్థి పార్టీలతో రాజీ చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మూడు రోజులుగా చెంగాళమ్మ త‌ల్లి ఆలయంలో వైసీపీ నేతలు రాజీ చర్చలు జరుపుతున్నారు. సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీ  నేతలు, అభ్యర్థులతో వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రాజీ చర్చలు జ‌రిపారు. టీడీపీ నేత వేనాటి రామచంద్రారెడ్డి 4 కౌన్సిలర్‌ స్థానాలు, ఓ కోఆప్షన్‌ పదవి తమ పార్టీకి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అందుకు కిలివేటి అంగీకరించినట్లు సమాచారం. అలాగే బీజేపీ నేతలతో చర్చలు జరిపి వారికి ఒకటో, రెండో కౌన్సిలర్లు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మొత్తం 25 వార్డులు ఉండగా, 121 మంది నామినేషన్లు దాఖలు చేశారు.  వైసీపీ తరఫున అన్ని వార్డులకు 63 మందితో నామినేషన్లు వేయించారు. టీడీపీ 7 వార్డులను వదిలేసి 18 వార్డుల్లో 25 మంది, బీజేపీ 10 వార్డులకు 16, జనసేన 3 నామినేషన్లు వేశారు. ఇప్ప‌టికే 43 మంది ఉపసంహరించుకున్నట్లు మున్సిప‌ల్ కమిషనర్‌ నరేంద్రకుమార్‌ తెలిపారు. వీరిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆరుగురు, వైసీపీ నుంచి 26 మంది,  బీజేపీ నలుగురు, కాంగ్రెస్ నుంచి ఒక‌రు,  బీఎస్పీ నుంచి ఒక‌రు,  సీపీఐ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులు నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక ఎంత‌మేర‌కు రాజీచర్చ‌లు ఫ‌లించి వైసీపీ త‌న ప్రాబ‌ల్యం నిరూపించుకుంటుందో చూడాలి!!.



మరింత సమాచారం తెలుసుకోండి: