తెలంగాణతో పాటు జాతీయ స్థాయిలో సంచలనం రేపిన న్యాయవాదుల హత్య కేసులో రోజుకో విషయం బయటపడుతూనే ఉంది. కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. వామనరావు దంపతుల హత్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. అయితే
న్యాయవాదులు వామనరావు దంపతుల దారుణ హత్యపై  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ న్యాయవాద విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక నేతను పార్టీ నుంచి తొలగించినట్టు చెప్పారు. హంతకులను వదిలిపెట్టబోమని, కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదుల హత్యకేసును కొందరు రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరమని అన్నారు.

 న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం కోసం కృషి చేస్తామని చెప్పారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో సమానంగా న్యాయవాదులు లాఠీ దెబ్బలు తిన్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రూ. 100 కోట్లతో న్యాయవాదుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపైనా కేటీఆర్ విరుచుకుపడ్డారు. నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, నల్ల చట్టాలను తెచ్చిందని  ఆరోపించారు.జీడీపీని పెంచుతామని పెట్రో, గ్యాస్ ధరలను కేంద్రం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై గతంలో కాంగ్రెస్‌ను తిట్టిన మోదీ ఇప్పుడు దేశ ప్రజలకు ఏమని సమాధానం చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు.

 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బుద్ది చెప్పాలని కోరారు కేటీఆర్. దేశ మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానిస్తే, తాము మాత్రం ఆయనను ఎంతగానో గౌరవిస్తున్నామని చెప్పారు కేటీఆర్. పీవీ కుమార్తె వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చామని, న్యాయవాదులంతా ఆమెకు అండగా నిలవాలని కేటీఆర్ కోరారు.మండలి ఎన్నికల్లో రెండు సీట్లను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని చెప్పారు. వాణిదేవి పోటీతో బీజేపీకి ఓటమి ఖాయమని తెలిసిపోయిందన్నారు. అందుకే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు

మరింత సమాచారం తెలుసుకోండి: