కొన్నిరోజుల క్రితమే ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. అస్సోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ పార్టీలు హామీలు వెల్లువెత్తిస్తున్నాయి. అడిగిన వారికి అడగని వారికి హామీలు గుప్పిస్తున్నాయి. ప్రాంతాలను బట్టి.. అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం అసోంలో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ అనేక ఆకర్షణీయమైన వాగ్దానాలు ప్రకటించారు.  

అవేంటంటే.. తాము గెలిస్తే గృహిణులకు నెలనెలా రూ.2వేలు ఖాతాల్లో వేస్తామని ప్రియాంక ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే పౌరసత్వ సవరణ చట్టం నిలిపివేస్తామన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల చొప్పున విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. తేయాకు మహిళా కార్మికులకు దినసరి వేతనం రూ.365 చేస్తామన్నారు. గృహిణి సమ్మాన్‌ పేరుతో ప్రతి గృహిణికి నెలనెలా రూ.2వేలు చొప్పున నగదు పంపిణీచేస్తామని ప్రియాంక చెప్పారు.

అంతే కాదు.. అసోంలో 5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. బిశ్వనాథ్‌ ప్రాంతంలో సాధురు టీ ఎస్టేట్‌కు వెళ్లిన ప్రియాంక అక్కడ కూలీలతో మాట్లాడారు. తేయాకు తెంపుతూ సందడి చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసి మహిళలతో కలిసి ఆమె తేయాకులను తెంపారు. వారు అందించిన టీ ని ఆస్వాదించారు. కూలీల మధ్య కిందే కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలకు తాను తెచ్చిన అరటిపండ్లను పంచిపెట్టారు.

ప్రియాంక గాంధీని చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తర్వాత తేజ్‌పుర్‌లోని స్థానిక తేయాకు కార్మికురాలి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ ఇంట్లో చిన్నారిని ఎత్తుకుని లాలించారు. అసోం ఎన్నికల విషయానికి వస్తే.. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27, ఏప్రిల్‌ 1, ఏప్రిల్‌ 6 తేదీల్లో పోలింగ్‌ జరగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: