బెజ‌వాడ కార్పొరేష‌న్‌ను ఎలాగైనా గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో అధికార పార్టీ వైసీపీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించింది. మిగిలిన కార్పొరేష‌న్ల‌కు విజ‌య‌వాడ‌కు చాలా తేడా ఉంది. ఇక్క‌డ పాగా వేయాలంటే.. సామాజిక స‌మీక‌ర‌ణ‌లతో పాటు బ‌ల‌మైన హామీలు గుప్పించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అదే స‌మ‌యంలో ఇక్క‌డ అప‌రిష్కృతంగా ఉన్న అనేక స‌మస్య‌ల‌పై దృష్టి సారించాలి. ఇక‌, అత్యంత బ‌ల‌మైన పార్టీలుగా ఉన్న టీడీపీ, క‌మ్యూనిస్టుల‌ను కూడా వైసీపీ ఎదిరించాలి.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు ప్ర‌జానాడి ఎలా ఉంది? ప‌్ర‌భుత్వంపై ఎలా అనుకుంటున్నారు?  ముఖ్యంగా ప‌శ్చిమ‌, తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి ఏవిధంగా అనే అంశాల‌పై సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా అడిగి తెలుసుకున్నార‌ని స‌మాచారం. అంతేకాదు.. మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిల‌కు విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌ను గెలిపించే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించార‌ని స‌మాచారం.  ఇప్ప‌టికే వారిద్ద‌రూ ప్ర‌ధాన పోటీ దారుగా భావిస్తున్న టీడీపీలోని కీల‌క నేత‌ల‌ను వైసీపీకి అనుకూలంగా మార్చుకునే కార్య‌క్ర‌మానికి కూడా శ్రీకారం చుట్టార‌ని తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు కీల‌కంగా ఉన్న నాయ‌కులు కూడా సైలెంట్ అయిపోయారు.

ఇక‌, వామ‌ప‌క్షాల్లో సీపీఎంను వైసీపీ వైపు ఇప్ప‌టికే తిప్పుకొన్నారు. మూడు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో తూర్పులో వైసీపీకి మంచి ఎడ్జ్ ఉంద‌ని.. అధిష్టానానికి నివేదిక‌లు అందాయి. ఇక్క‌డ అవినాష్ దూకుడు పార్టీకి చాలా ప్ల‌స్ అయ్యింద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు.  సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న టీడీపీని అదుపు చేసే చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కీల‌క‌మైన నాయకుడిగా ఉన్న బొండా ఉమాను సైలెంట్ చేస్తే.. ఇక్క‌డ వైసీపీకి ఢోకా ఉండ‌ద‌ని భావిస్తున్నారు. సెంట్ర‌ల్లో కూడా ఉమా అనుచ‌రులుగా ఉన్న వారిని కొంద‌రిని పార్టీలోకి లాగేశారు. అలాగే అవినాష్‌కు సెంట్ర‌ల్లోనూ కొన్ని డివిజ‌న్ల బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఇక‌, ప‌శ్చిమ‌లో మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గిస్తే.. ఇక్క‌డ కూడా సానుకూల ప‌వ‌నాలు ఉన్నాయ‌ని అంటున్నారు. అలాగే టీడీపీలో ఉన్న గ్రూపు త‌గాదాల‌ను కూడా క్యాష్ చేసుకునేలా వైసీపీ నాయ‌కులు వీలైన‌న్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కేబినెట్లో పుర పోరు ఎదు‌ర్కోని మెజార్టీ మంత్రుల‌ను విజ‌య‌వాడ‌లోనే మోహ‌రించేలా నేరుగా జ‌గ‌నే వ్యూహాలు సిద్ధం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: