ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో నాలుగు ద‌శల పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిశాయి. అధికార పార్టీ విజ‌య‌దుందుభి మోగించింది. అయితే కొన్ని జిల్లాలు... కొన్ని ప్రాంతాల్లో అనుకున్న రేంజ్‌లో మాత్రం అడుగులు వేయ‌లేక‌పోయామ‌నే అసంతృప్తి ఉంది. కొన్ని జిల్లాల్లో మంత్రులు స‌రిగా ప‌నిచేయ‌లేద‌ని.. మ‌రికొన్ని చోట్ల నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు తీవ్రంగా ఉంద‌ని.. ఇంకొన్ని చోట్ల స‌రైన నాయ‌క‌త్వం లేక ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింద‌ని ఇలా.. అనే కార‌ణాలు వైసీపీ అధినేత జగ‌న్‌కు చేరిపోయాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లు, కార్పొరేష‌న్ల‌లో ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు.

పంచాయ‌తీ ఎన్నిక‌లు పార్టీ సింబ‌ల్ మీద జ‌ర‌గ‌లేదు.. ఇక రెండు పార్టీల మ‌ధ్య ఏక‌గ్రీవాలు అయిన పంచాయ‌తీలు సైతం చాలా చోట్ల అధికార పార్టీ ఖాతాలో ప‌డ్డాయి. ఇండిపెండెంట్ల‌కు వైసీపీ కండువాలు క‌ప్పేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిని కూడా త‌మ ఖాతాలో వేసుకున్నారు. రేపు మునిసిపాల్టీలు, కార్పొరేష‌న్లు పార్టీ సింబ‌ల్ మీదే ఉంటాయి. వాటిని తారుమారు చేయ‌డం కుద‌ర‌దు. అందుకే జ‌గ‌న్ ఎక్క‌డిక‌క్క‌డ పార్టీ నేత‌ల‌కు డెడ్ లైన్లు పెట్టేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ మొత్తం 12 కార్పొరేష‌న్లు.. 75 మునిసిపాలిటీల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో 90 శాతం సాధించి తీరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే.. దీనిని బ‌ట్టి 10 కార్పొరేష‌న్‌లు, 65 మునిసిపాలిటీల‌ను వైసీపీ త‌న ఖాత‌లో వేసుకోవాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంది. అంతేకాదు.. మంత్రుల‌కు కొన్ని టార్గెట్‌లు కూడా పెట్టేశారు.

ఈ ఎన్నిక‌ల‌ను ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు రిఫ‌రెండ్ అన్నా అన‌క‌పోయినా.. మ‌న‌కు మాత్రం రిఫ‌రెండ‌మేన‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు స‌మాచారం. అనేక ప‌థ‌కాల‌ను రెండేళ్లుగా అమ‌లు చేస్తున్నామ‌ని.. వీటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని  ఆయ‌న సూచించారు. అంతేకాదు.. ఈ రెండేళ్ల నుంచి ఆయా ప‌థ‌కాల‌ను అందుకుంటున్న‌వారు..వైసీపీకే ఓటు వేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. మ‌రీ ముఖ్యంగా వ‌చ్చే రోజుల్లో మ‌రికొన్ని ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్న నేప‌థ్యంలో వాటిని కూడా ప‌రోక్షంగా ప్ర‌చారంలో పెట్టాల‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ ఈ ఎన్నిక‌ల‌ను రెఫ‌రెండంగానే తీసుకోవాల‌ని జ‌గ‌న్ చెప్పార‌ట‌.

అన్నిటిక‌న్నా ముఖ్యంగా న‌గ‌ర ప్రాంతాల్లో జ‌గ‌న్ ప‌ట్ల వ్య‌తిరేక‌త ఉంద‌న్న ఓ టాక్ గ‌త ఎన్నిక‌ల నుంచి ఉంది. దానిని కూడా ఈ ఫ‌లితాల‌తో తుడిచి పెట్టేయాల‌ని జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌రిగిన లోపాల‌ను స‌రిదిద్దుకుని ముందుకు సాగాల‌ని కూడా ఆయ‌న నేత‌ల‌కు ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: