ఔను.. ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ? చీరాల ఎమ్మెల్యేగా ఉన్న క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి గ‌త ఎన్నిక‌ల అనంత‌రం.. త‌న కుమారుడి భ‌విత‌వ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారి.. వైసీపీ కండువా క‌ప్పుకొన్నారు. ఇక‌, ఈ పార్టీలోనే త‌మ భవిష్య‌త్తు అని అప్ప‌ట్లో చెప్పుకొచ్చారు. అయితే వైసీపీలో క‌ర‌ణం రాజ‌కీయం అంతా రివ‌ర్స్‌లో న‌డుస్తోంది. సుదీర్ఘ కాలం టీడీపీలో ఉన్న ఆయ‌న‌కు రాజ‌కీయాలు తెలియ‌వా ?  పార్టీ మారిన  నేప‌థ్యంలో ఇప్ప‌డున్న పార్టీలో ప‌ట్టు పెంచుకోవాల‌నే స్పృహ ఆయ‌న‌కు లేదా? అంటే.. అన్నీ ఉన్నాయి. కానీ.. ఉద్దేశ పూర్వ‌కంగానే ఆయ‌న ప‌ట్టు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం లేద‌ని అంటున్నారు.

వైసీపీ నేత‌లంటే ఆయ‌న‌కు ఇప్ప‌టికీ చీద‌ర‌మే!  గ‌త 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు గుప్పించారో.. ఇప్ప‌టికీ అదే మ‌న‌స్త‌త్వంతో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెర‌చాటున ఆయ‌న వైసీపీలోకి రావ‌డంపై త‌న‌ను తాను విమ‌ర్శించుకున్న సంద‌ర్భాలే ఎక్కువ‌. రెడ్డి రాజ్యంలో గ‌తిలేక ఉంటున్నామంటూ.. త‌న అనుచ‌రుల వ‌ద్ద చేసిన కామెంట్లు కొన్ని రోజులు వైర‌ల్ అయ్యాయి. అయితే.. అప్ప‌ట్లో ఆయ‌న వాటిని ఖండిచినా.. చేస్తున్న ప‌నులు, అనుస‌రిస్తున్న విధానాలు గ‌మ‌నిస్తున్న వారు మాత్రం.. ఆయ‌న త‌న పంథాను వీడడం లేద‌ని.. టీడీపీ నేత‌ల‌పై ఉన్న శ్ర‌ద్ధ .. నేటికీ.. వైసీపీలో లేద‌ని చెబుతున్నారు.

ఇక్క‌డ మ‌రో చిత్ర‌మైన విశేషం ఏంటంటే.. టీడీపీలో ఏం జ‌రుగుతున్నా.. వెంట‌నే క‌ర‌ణంకు తెలిసిపోవ‌డం. అంతేకాదు.. టీడీపీ నేత‌ల‌తోనూ ఆయ‌న స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగిస్తుండ‌డం. దీంతో వైసీపీ నాయ‌కులు ఈ విష‌యం తెలిసి.. ఆయ‌న‌కు దూరంగా ఉంటున్నారు. ఇక‌, క‌ర‌ణ‌మైనా.. వారిని చేర‌దీసుకుని ముందుకు సాగుతున్నారా? అంటే అది కూడా క‌నిపించ‌డం లేదు. ఇక అధిష్టానం ఎన్నిసార్లు చూచించినా చీరాల వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ తోనూ.. అటు అద్దంకి వైసీపీ ఇన్‌చార్జ్ బాచిన కృష్ణ చైత‌న్య‌తోనూ ఆయ‌న ఏ మాత్రం స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం లేదు.

పార్టీలో ఏదో పేరుకు మాత్ర‌మే ఉన్నామంటూ త‌మ ప‌నులు చ‌క్క‌పెట్టుకుంటున్నారు. ఈ మొత్తం ప‌రిణామంలో చూస్తే.. క‌ర‌ణం.. ఎప్ప‌టికీ..వైసీపీలో ప‌ట్టు సాధించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌నే. ఆయ‌న పార్టీలో ఉన్నా.. కార్య‌క్ర‌మాలు.. చేత‌లు అన్నీ కూడా టీడీపీకి ప‌రోక్షంగా మేలు చేస్తున్న‌వే కావ‌డంతో వైసీపీ కేడ‌ర్ ఆయ‌న‌కు డిస్టెన్స్ పాటిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. క‌ర‌ణంకు వైసీపీ కేడ‌ర్ చేరువ కావ‌డం ఇప్ప‌ట్లో జ‌రిగే ప‌నికాద‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: