ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవగింజ దొరికినా కూడా ఎత్తుకెళ్లి పోతున్నారు. కరోనా అలా మార్చేసింది.. రాత్రుళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు చాలా తక్కువ అయ్యారు అంటే ఏదో అనుకున్నారు. కానీ వీరంతా ఇప్పుడు డే షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నారు. బాగా డబ్బులు ఉన్న ఇళ్లను చూసి టార్గెట్ చేస్తున్నారు. నమ్మకం కలిగించి ఉన్నదంతా ఊడ్చుకు పోతున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనే ఎదురైంది. ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ అందరినీ నైస్ గా నమ్మించారు. ఓ రోజు అదును చూసుకొని అందరికీ స్వీట్ బాక్స్ ఇచ్చారు ఉన్నదంతా మూట కట్టుకుని పోయారు.


వివరాల్లోకి వెళితే..మల్కన్‌గిరి జిల్లాకేంద్రంలోని బుట్టిగుడ వీధికి చెందిన ఉషా పటేల్‌ ఇంటికి మూడు నెలల క్రితం సుభాష్‌ అనే వ్యక్తి భార్యతో వచ్చి ఇల్లు అద్దెకు అడిగాడు. ఇల్లు ఖాళీగా ఉండడంతో ఉషాపటేల్‌ వారికి అద్దెకు ఇచ్చింది. మూడు నెలలు నమ్మకంగా ఉన్నారు. అందరితో కలిసి పోయేవారు. అయితే ఓ రోజు ఇంటికి వచ్చి, తనకు మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వారందరికీ ముందుగానే మత్తుమందు కలిపిన స్వీట్స్‌ పంచిపెట్టాడు... అందరూ అతని మంచి తనం చూసి స్వీట్స్ తీసుకొని తిన్నారు.



అలా స్వీట్స్‌ తిన్న వారందరూ ఓ గంటలో మత్తులోకి జారుకున్నారు. రాత్రి పది గంటల సమయంలో భార్యతో కలిసి సుభాష్‌ యజమాని ఇంటిలో ఉన్న రూ.35 లక్షల విలువ చేసే బంగారం, రూ.2.5 లక్షల నగదుతో పాటు, చుట్టుపక్కల ఏడిళ్లలో చిన్నపాటిగా నగదు దోచుకుని భార్యతో సహా పరారయ్యాడు. మంగళవారం ఉదయం యజమాని ఉషాపటేల్‌ లేచి చూసింది. ఇంట్లో విలువైన వస్తువులు లేవు.. చూస్తే స్వీట్స్ ఇచ్చిన వాళ్ళు లేరు. ఆ దంపతులే దోచుకున్నారని గ్రహించి చుట్టుపక్కల వారిని పిలిచి లబోదిబోమంది. దీంతో ఇరుగుపొరుగు వారు కూడా తమ ఇళ్లలో కూడా దోచుకున్నట్లు గుర్తించి అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందిత భార్యాభర్తల కోసం గాలిస్తున్నారు.. ఇలా గుడ్డిగా నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: