కామాంధులు తమ లైంగిక కోరికలను తీర్చుకోవడానికి ముక్కు పచ్చలారని పసిబిడ్డలపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అయితే చిన్న పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడే కామాంధులలో ఎక్కువగా ఇరుగుపొరుగువారు, బంధువులే ఉంటున్నారు. ఈ మానవ మృగాళ్లు తమపై ఏం చేస్తున్నారో తెలియని చిన్న పిల్లలు తమపై జరుగుతున్న ఆకృత్యాలను తల్లిదండ్రులకు చెప్పలేకపోతున్నారు. దీంతో కామాంధులు మరింత పెట్రేగిపోతున్నారు. అయితే ఎవరు మంచిగా ప్రవర్తిస్తున్నారో.. ఎవరు తప్పుగా ప్రవర్తిస్తున్నారో అనే విషయాలను పూర్తిస్థాయిలో తెలుసుకునే లాగా చిన్నపిల్లల్లో అవగాహన కల్పించేందుకు వరంగల్ కి చెందిన భరద్వాజ్ అనే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఓ ఆవిష్కరణ కనిపెట్టారు. దానికి సంస్కార్ అనే పేరు పెట్టారు.


పూర్తి వివరాలు తెలుసుకుంటే.. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి అయిన భరద్వాజ్ వరంగల్‌ రూరల్‌ ఇన్నోవేటర్‌ అయిన యాకర గణేశ్‌ సహకారంతో ఒక స్మార్ట్ డాల్ ని తయారు చేశారు. ఈ బొమ్మ తయారీకి ఒక ట్రాన్సిస్టర్, రకరకాల సెన్సార్లు, ఒక స్పీకరు, మైక్రో సెన్సార్లు ఉపయోగించారు. అయితే ఈ బొమ్మను రకరకాల భాగాల్లో టచ్ చేస్తున్నప్పుడు ఆ టచ్ మంచిదో.. లేక చెడ్డదో స్పీకర్ ద్వారా పెద్దగా వినిపిస్తుంది. ఈ బొమ్మను చిన్న పిల్లలకు ఇవ్వడం ద్వారా వారికి గుడ్ టచ్ ఏంటో, బ్యాడ్ టచ్ ఏంటో పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. బంధువులు గాని ఇరుగుపొరుగువారు ఎవరైనా గానీ తప్పుగా ప్రవర్తిస్తే చిన్న పిల్లలు వారికి దూరంగా ఉండటం చేస్తారు.. లేక తమ తల్లిదండ్రులతో చెప్తారు. దీని వల్ల పిల్లలపై అఘాయిత్యాలు ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది.


నిజానికి పిల్లలు బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టం చూపిస్తుంటారు. ముఖ్యంగా మాట్లాడే బొమ్మతో ఇంకా బాగా ఆడుకుంటారు. అదే.. ఏది మంచో ఏది చెడో థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా తెలియజేసే స్మార్ట్ బొమ్మతో ఆడుకుంటే వారి మాన ప్రాణాలను వారే కాపాడుకోవచ్చు. ఇకపోతే ఈ సరికొత్త ఆవిష్కరణ కనిపెట్టిన భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఈ బొమ్మలను అందరికీ పంపిణీ చేసి అవగాహన కల్పించాలని కోరుతున్నారు.


ఐతే ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో పాటు షీటీమ్, తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ వంటి పలు ప్రభుత్వ విభాగాలు భరద్వాజ్ కనిపెట్టిన ఆవిష్కరణ పై స్పందించాయి. ఈ ఆవిష్కరణ మరింత అభివృద్ధి చేయాలని జయేశ్‌ రంజన్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ కి సూచించారు. దీంతో ఈ బొమ్మ సృష్టికర్తలతో భేటీ కావడానికి అధికారులు సిద్ధమయ్యారు. మొదట నాలుగైదు ప్రభుత్వ పాఠశాల్లో చిన్న పిల్లలకు ఈ బొమ్మలను అందించి ఆ తర్వాత ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటామని.. ఫీడ్ బ్యాక్ అనంతరం తమ బొమ్మను ఇంకా మెరుగు పరుస్తామని భరద్వాజ్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: