శశికళ.. తమిళ రాజకీయాల్లో బాగా నలుగుతున్న పేరు.. సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆమె బెంగళూరులోని జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఆమె రాక తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిందన్న అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టే శశికళ జైలు నుంచి తమిళనాడు వచ్చిన తీరు కూడా  సంచలనం సృష్టించింది. ఆమెకు దారిపొడవునా అభిమానులు స్వాగతం పలికారు. ఇక
ఆమె రాకతో రాజకీయాలు మరింత ఊపందుకుంటాయన్న అంచనాలు ఉన్నాయి. పార్టీల మధ్య పొత్తుల చర్చలకూ రంగం సిద్ధమవుతున్న సమయంలో శశికళ ఉన్నట్టుండి బాంబు పేల్చారు.


ఎవరూ ఊహించని ట్విస్టు ఇచ్చారు. అదేంటంటే.. ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన విడుదల చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నా.. అన్నాడీఎంకే విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ప్రకటించారు. ఇంకా మరో వందేళ్లపాటు అన్నాడీఎంకే పాలనే సాగాలని ఆమె ఆకాంక్షించారు. దీని కోసం జయలలిత అభిమానులు, అన్నాడీఎం కే కార్యకర్తలు కృషి చేయాలని
శశికళ తన ప్రకటనలో తెలిపారు. జయలలిత చెప్పినట్టు అన్నాడీఎంకే ప్రత్యర్థి డీఏంకేనని..  ఆ పార్టీ గద్దె ఎక్కకుండా అడ్డుకోవాలని ఆమె పిలుపు ఇచ్చారు.


ఓవైపు .. శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకోవాలని ఏకంగా అమిత్ షా వంటి వారు కోరుతున్న సమయంలో శశికళ ఇలాంటి ప్రకటన విడుదల చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే పార్టీని ఎదుర్కొనేందుకు ప్రస్తుత సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చరిష్మా సరిపోదని బీజేపీ భావిస్తోంది. అందుకే వారికి అండగా ఉండేందుకు దివంగత జయలలిత సన్నిహితురాలైన వీకే శశికళను అన్నాడీఎంకేలోకి చేర్చేందుకు కమల నాథులు ప్రయత్నిస్తున్నారు. శశికళను చేర్చుకునేలా ఈపీఎస్‌, ఓపీఎస్‌పై  ఒత్తిడి చేస్తున్నారు.


మరోవైపు బీజేపీ ప్రతిపాదనకు పన్నీరు సెల్వం కూడా సుముఖత వ్యక్తం చేశారని.. పళనిస్వామి మాత్రం విముఖత ప్రదర్శించారని సమాచారం. ఇలాంటి సమయంలో అనూహ్యంగా శశికళ ఏకంగా రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటన విడుదల చేయడం అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: