భారతీయ జనతా పార్టీతో ప్రజలు విసిగిపోయార‌ని  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన మునిసిపల్ వార్డు ఉప ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే 2022లో జరిగే మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. ఈ ఫ‌లితాలు చూసైనా ఆ పార్టీ మారాల‌న్నారు ఢిల్లీ ప్రజలు ఆప్‌ను నమ్ముతున్నారన‌డానికి ఈ ఫ‌లితాలే నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

ఉత్తర ఢిల్లీలోని రోహిణి-సి, షాలిమార్ బాగ్ నార్త్; తూర్పు ఢిల్లీలోని త్రిలోక్ పురి, కల్యాణ్ పురి, చౌహాన్ బంగర్ వార్డులకు ఉప ఎన్నికలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కల్యాణ్ పురిలో 7,043 ఓట్ల ఆధిక్యంతో ఆప్ అభ్యర్థి ధీరేంద్ర కుమార్ విజయం సాధించారు. అదేవిధంగా షాలిమార్ బాగ్‌లో 2,705 ఓట్ల ఆధిక్యంతో సునీత మిశ్రా (ఆప్), రోహిణి-సి నుంచి 2,985 ఓట్ల ఆధిక్యంతో రామ చంద్ర (ఆప్), త్రిలోక్ పురి నుంచి 4,986 ఓట్ల ఆధిక్యంతో విజయ్ కుమార్ (ఆప్), చౌహాన్ బంగర్ నుంచి 10,642 ఓట్ల మెజారిటీతో జుబేర్ అహ్మద్ చౌదరి (కాంగ్రెస్) విజ‌య‌బావుటా ఎగ‌రేశారు.

ఈ ఫ‌లితాల‌పై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రజలకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఢిల్లీ ప్రజలు తమ పార్టీపై నమ్మకం ఉంచారని మనీశ్ సిసోడియా ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్ర‌జ‌లు ఏ మేర‌కు బీజేపీతో విసుగెత్తిపోయార‌నేదానికి ఈ ఎన్నిక‌లే నిదర్శనమని తెలిపారు. 2022లో జరిగే ఢిల్లీ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయిలో తుడిచిపెట్టుకుపోనుంద‌ని జోస్యం చెప్పారు. ఆప్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలను ఆయ‌న అభినందించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీని చూస్తార‌ని త‌మ పార్టీ కూడా పనిచేసే రాజకీయాలను తీసుకురానున్నార‌ని జోస్యం చెప్పారు.

ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ త‌న ట్వీట్‌లో ఢిల్లీ ప్రజలను అభినందించారు. సుపరిపాలనకు మరోసారి ఢిల్లీ ప్రజలు ఓటు వేశారని, . ఢిల్లీ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో 15 సంవ‌త్స‌రాల బీజేపీ పాల‌న‌పై విసిగిపోయార‌ని, ఎప్పుడు ఎన్నిక‌లు వ‌స్తాయా? ఎప్పుడు ఆప్‌కు అధికారం క‌ట్ట‌బెడ‌దామా అంటూ ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నార‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: