ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల్లో కూరుకుపోయింద‌ని కాగ్ నివేదిక వెల్ల‌డించింది. కాగ్ చెప్పినా చెప్ప‌క‌పోయినా రెండు సంవ‌త్స‌రాల నుంచి ప్ర‌జ‌లంద‌రికీ ఇది అవ‌గ‌త‌మైన విష‌య‌మే. ఇప్పుడు ప్ర‌త్యేకంగా కాగ్ చెప్పిందేముంద‌ని అంద‌రూ పెద‌వి విరుస్తున్నారు. రెండేళ్లుగా ఆర్థికాభివృద్ధికానీ, రాష్ట్రాభివృద్ధికానీ లేని రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్ర‌మేన‌ని చిన్న‌పిల్ల‌వాణ్ని అడిగినా చెపుతున్నారు. ఇప్పుడు ప్ర‌త్యేకంగా కాగ్ చెప్ప‌డానికేముంటుంది?? ప‌నులంటూ జ‌రిగితే అభివృద్ధి సాధ్య‌ప‌డుతుందికానీ, అన్నీ ఆపేసి కూర్చుంటే అభివృద్ధి ఎలా సాధ్య‌ప‌డుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

ఆర్థిక సంక్షోభం దిశగా ఏపీ వెళ్తొందని కాగ్ నివేదిక‌ తేల్చింది. రాష్ట్రం పదినెలలకు తీసుకున్న రుణం రూ. 73,913 కోట్లకు చేరింది.  బడ్జెట్‌లో అంచనా రూ.48,295 కోట్లు కాగా.. ఇది అంచనాకన్నా 153 శాతం ఎక్కువ అని తెలిపింది. ఇక రెవెన్యూ లోటు రోజురోజుకు పెరిగిపోతోందని, ఇది 300 శాతం అధికమని కాగ్ అంటోంది. బడ్జెట్‌లో రెవెన్యూ లోటు అంచనా రూ.18, 434 కోట్లు ఉండగా.. అసలు రెవెన్యూ లోటు రూ.54,046 కోట్లు ఉందని నివేదిక‌లో ప్ర‌స్తావించారు. రెవెన్యూ రాబడి పెరిగినా సంక్షేమ కార్యక్రమాలతో అప్పుల ఊబిలో ఏపీ చిక్కుకుంది. గతేడాది జనవరి నెలాఖరు వరకు అప్పులు రూ.46,503 కోట్లు తీసుకుందని, బహిరంగ మార్కెట్‌ రుణాల సేకరణలో ఏపీకి దేశంలో 4వ స్థానంలో ఉందని కాగ్ తెలిపింది. బహిరంగ మార్కెట్‌లో రుణాలు తీసుకున్నా.. ఏపీ రాష్ట్ర అవసరాలు తీరలేదని నివేదికలో ఉంది.  డిసెంబర్‌లో 30 రోజుల స్పెషల్‌ డ్రాయింగ్‌, 26 రోజుల చే బదుళ్లు.. మూడు రోజుల ఓవర్‌ డ్రాఫ్ట్‌‌ను కాగ్ పరిశీలించింది.

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో కాగ్ నివేదిక క‌ళ్ల‌కు క‌ట్టింది. మార్కెట్ ద్వారా నిధుల సేకరణతో పాటు ఏపీ ప్రభుత్వం మూడు మార్గాల ద్వారా రుణాలు పొందింది. బహిరంగ మార్కెట్‌లో రుణాలు తీసుకుని.. ఇంకా రుణాలు తీసుకునేందుకు అవకాశాలు లేనప్పుడే ఈ మూడు మార్గాలను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వాలకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మూడుమార్గాలైనా ఉన్నాయా? అంటే స‌మాధానం లేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: