విశాఖ జిల్లాలో ఎన్నికల సమరం పదునెక్కింది. పేరుకు మునిసిపల్ ఎన్నికలు అయినా కూడా  అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా వాడీ వేడిగా ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. దాంతో విశాఖ సాగర తీరం ఒక్కసారిగా హీటిక్కింది.అటూ ఇటూ రాజకీయ తూటాలు పేలుతున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ తో మొదలుపెట్టి ప్రత్యేక హోదా రాజధాని వంటి అంశాలు మునిసిపల్ ఎన్నికల వేళ నేతలు ప్రస్తావనకు తెస్తున్నారు. ఇక విశాఖతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలో ప్రచారానికి లోకేష్ రావడంతో టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇప్పటిదాకా  ఒక మాదిరిగా సాగిన టీడీపీ ఎన్నికల ప్రచారం లోకేష్ రాకతో ఒక్కసారిగా  జోరు అందుకుంది. పంచ్ డైలాగులు వైసీపీ మీద జగన్ మీదా పేలుస్తూ లోకేష్ విశాఖలో  రోడ్ షోలు చేస్తున్నారు. లోకేష్ రోడ్ షోలకు టీడీపీ బాగానే ఏర్పాట్లు చేసింది. జనాలను కూడా పెద్ద ఎత్తున తరలించింది. ఇక విశాఖలో లోకేష్ సభలు సూపర్ హిట్ చేయడానికి పసుపు పార్టీ గట్టిగానే చర్యలు తీసుకోవడంతో  ఎటు చూసినా విశాఖ సిటీ పసుపు కళతో కనిపిస్తోంది.

మరో వైపు చూస్తే ఇప్పటిదాకా వైసీపీ ఏకపక్షంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన భుజాల మీదనే మొత్తం ప్రచారం పెట్టుకున్నారు. ఆయనే వార్డుల్లో పాదయాత్రలు చేస్తూ మీటింగులు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. ఇపుడు లోకేష్ కూడా బరిలోకి దిగడంతో  మార్చి ఎండలను మించేలా నేతల పాలిటిక్స్ సాగుతోంది. మరో వైపు జనసేనాని పవన్ కూడా విశాఖకు ఎన్నికల ప్రచారానికి వస్తారని అంటున్నారు. పవన్ కూడా రెండు రోజుల పాటు విశాఖలో మకాం చేసి మొత్తం ప్రచారం పార్టీకి చేస్తారని అంటున్నారు. దాంతో బీజేపీ జనసేన కూటమి పవన్ రాక కోసం ఎదురుచూస్తోంది.  దాంతో విశాఖ మునిసిపల్ ఎలక్షన్ వేడి పీక్స్ కి చేరుతుంది అంటున్నారు  చూడాలి మరి పోరు ఎలా ఉంటుందో.






మరింత సమాచారం తెలుసుకోండి: