పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. అన్ని పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో గతంలో ఎప్పుడు లేనంతగా ఎమ్మెల్సీ ఎన్నికల పోరు జరుగుతోంది. ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలు వంద మందికో ఇంచార్జ్ ను నియమించుకుని ప్రచారం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ ఓటర్లుగా ఉన్న ఉద్యోగులు ఎటు వైపు మొగ్గు చూపితే వాళ్లదే విజయమనే చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ సర్కార్ తీరు, పీఆర్సీ ప్రకటించకపోవడంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు.. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఉద్యోగులు తమకు వ్యతిరేకంగా ఉన్నారని గ్రహించిన టీఆర్ఎస్ నేతలు.. వాళ్లపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ సర్కార్ పై బహిరంగంగానే తమ అసమ్మతి వ్యక్తం చేస్తున్న టీచర్లను గులాబీ నేతలు టార్గెట్ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

టీఆర్ఎస్ ను మరోసారి దెబ్బతీయాలని కృతనిశ్చయంతో ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తన విమర్శల్లో మరింత పదును పెంచారు. ఇంకా మూడేళ్లు తామే అధికారంలో ఉంటామని చెప్పుకుంటూ కొందరు మంత్రులు టీచర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఓటేయకపోతే చూస్కుంటాం అని హెచ్చరిస్తున్నారని వివరించారు. కానీ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఒక విషయం గుర్తుంచుకోవాలని, టీచర్ల చేతుల్లో ఉండే పెన్నులు మార్చి 14న గన్నులుగా మారి కేసీఆర్ గుండెల్లో దిగబోతున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల యుద్ధం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యేనని బండి సంజయ్ ఉద్ఘాటించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కాదు... పైసలు నింపుకున్న గల్లా రాజేశ్వర్ రెడ్డి అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బ్రోకర్ అంటూ నిప్పులు చెరిగారు.

తెలంగాణలో ఈ నెల 14న  మహబూబ్ నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానంతో పాటు వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున పీవీ కుమార్తె వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీలో ఉండగా, బీజేపీ తరఫున రాంచందర్ రావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: