దేశమంతా శశికళ  పునరాగమనాన్ని ఆసక్తిగా గమనిస్తుండగా  అత్యంత సంక్లిష్టంగా ఉండే తమిళనాడు రాజకీయాల్లో ఆమె మళ్లీ చక్రం తిప్పడం ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి. అత్యంత శక్తిమంతులైన మోదీ–షా ద్వయాన్ని ఢీకొనబోతున్న ధీరురాలిగా ఆమె పేరు ప్రొజెక్ట్ చేస్తుండగా  ఇంకొద్ది రోజుల్లోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనగా శశికళ ఈ షాకింగ్ ప్రకటన చేశారు. అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో దోషిగా జైలు శిక్షను పూర్తి చేసుకుని, జనవరిలో విడుదలైన వీకే శశికళ తనను బహిష్కరించిన అన్నాడీఎంకే పార్టీపై తిరిగి పట్టు సాధించబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు రావడం, మొన్న జయలలిత జయంతి నాడు కూడా తమిళ సినీ, రాజకీయ వర్గాలు ఆమె ఇంటికి క్యూకట్టడం, దాంతో శశికళ మళ్లీ జూలు విదిలించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది.


కానీ వాటన్నింటికీ రివర్సులో శశికళ ఏకంగా రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి తప్పుకున్నారు. పొలిటికల్, పబ్లిక్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ బుధవారం రాత్రి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.జయ అధికారంలో ఉన్నప్పుడు గానీ, పదవిలో లేనప్పుడు గానీ నేను ఏనాడూ అధికారం, పదవి కోసం అర్రులు చాచలేదు. జయ మరణం తర్వాత కూడా ఆ రెండిటినీ  నేను కోరుకోలేదు. ఇప్పుడు నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను. అయితే.. జయ స్థాపించిన పార్టీ గెలవాలని ప్రార్థిస్తున్నాను. ఆమె వారసత్వం కలకాలం కొనసాగుతుంది’ అని వీడ్కోలు లేఖలో శశికళ పేర్కొన్నారు. జయ మరణం తర్వాత తమిళనాడులో ఏర్పడిన పొలిటికల్ వాక్యూమ్ లో తాను భర్తీ అయ్యేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేయడం, సామదానబేధ దండోపాయాలతో శశికళను జైలుకు పంపేసి, పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలను మచ్చిక చేసుకోవడం, దెబ్బకు అన్నాడీఎంకేను ఎన్డీఏ భాగస్వామిగా మలుచుకోవడం చకాచకా జరిగిపోయాయి.


కాగా ఈ ఏడాది జనవరిలో శశికళ జైలు నుంచి విడుదలైన తర్వాత పొలిటికల్ సీన్ అటు ఇటు అయినట్లు కనిపించడం, అన్నాడీఎంకేపై శశికళ తిరిగి పట్టు బిగిస్తే బీజేపీతో కలిసి పోగలరా? అని, ఒక వేళ శశికళ తోకజాడిస్తే మళ్లీ జైలుకు పంపేందుకూ బీజేపీ వెనుకాడబోదనే వాదనలను విస్తృతంగా వినిపించాయి. చివరికి రాజకీయాల నుంచి, ప్రజాజీవితం నుంచి పూర్తిగా తప్పుకోవడం ద్వారా సైలెంట్ అయిపోవాలనే శశికళ నిర్ణయించుకోవడం డీల్‌లో భాగంగా జరిగిందేనా? అనే కామెంట్లు వస్తున్నాయి. ఈ పరిణామంతో ఆమెనే నమ్ముకున్న దినకరన్ ఎలాంటి స్టెప్ వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి.1991లో జయలలిత సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టడానికి ముందునుంచే అంటే 1980 నుంచే శశికళ ఆమెకు నమ్మకస్తురాలిగా మెలిగారు.


2016 డిసెంబర్‌లో జయలలిత మరణం తర్వాత ఆమె స్థానంలోకి రావాలని పలు ప్రయత్నాలు చేశారు. అయితే అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో 2017, ఫిబ్రవరిలో జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లే కంటే ముందే తన నమ్మకస్తుడు, అన్నాడీఎంకే నేత కే పళనిస్వామిని సీఎంగా ఎంపిక చేశారు. ఆ తర్వాత జైలుకు వెళ్లారు. కొద్ది రోజుల్లోనే అన్నాడీఎంకే పార్టీ పళనిస్వామి, పన్నీర్‌ సెల్వమ్‌ నేతృత్వంలో రెండు వర్గాలుగా చీలిపోయింది.బీజేపీ సంప్రదింపులతో ఇరువర్గాల మధ్య విభేదాలు సద్దుమణిగి పళనిస్వామి సీఎంగా, పన్నీర్‌ సెల్వం డిప్యూటీ సీఎంగా పదవులు చేపట్టారు. బీజేపీ, పార్టీ నేతల సూచనలతో శశికళను పార్టీ నుంచి బహిష్కరించారు. నాలుగేండ్ల జైలు శిక్షను పూర్తిచేసుకొని జనవరిలో జైలు నుంచి విడుదలైన శశికళ తమిళనాడులో అడుగుపెట్టారు. దీంతో ఆమె తీసుకోబోయే తదుపరి నిర్ణయాలు, రాజకీయ కార్యాచరణపైకి అందరి దృష్టి మళ్లింది. ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా మరో ఆరేండ్లు నిషేధం ఉండటంతో ఎవరికి మద్దతు ఇస్తారోనన్న ఉత్కంఠ పెరిగింది. తనని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన పళనిస్వామి, పన్నీర్‌ సెల్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా? తన మేనల్లుడు దినకరన్‌ స్థాపించిన ‘అమ్మ మక్కల్‌ మున్నెట్ర కజగమ్‌’ పార్టీలోకి వెళ్తారా? అన్న చర్చ కొనసాగుతూ వచ్చింది. ఇలాంటి సమయంలో ఆమె రాజకీయాలకు గుడ్‌ బై చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: