ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఒక బ్రోక‌ర్‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పోలీసుల‌ను బెదిరించి రౌడీయిజం చేయిస్తున్నారు. అలాగే రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి 16 నెల‌లు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్క‌డికి వ‌చ్చి దందాలు చేస్తూ బ‌తుకుతున్నారు... అంటూ తెలుగుదేశం పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాఖ అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చెన్నాయుడు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఏపీలో రాక్ష‌స పాల‌న‌
అచ్చెన్నాయుడు విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశారు. ప్రజల నెత్తిపై లక్ష కోట్ల రూపాయ‌ల‌ అప్పులున్నాయ‌ని, రాష్ట్రంలో రాక్షస పాలన, దొంగల పాలన నడుస్తోందని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను నిండా దోచుకుంటున్నారని, పథకాల పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ.లక్ష కోట్ల అప్పు ప్రజల నెత్తిన వేశారని మండిప‌డ్డారు. హుద్‌హుద్ తుఫాన్ స‌మయంలో త‌మ నేత చంద్రబాబు ఇక్కడే ఉండి సేవలందించిన విషయం గుర్తుంచుకోవాలని స్థానికుల‌కు సూచించారు. గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర‌పాల‌క సంస్థ అభివృద్ధి చెందాలంటే అది తెలుగుదేశం పార్టీవ‌ల్లే సాధ్య‌ప‌డుతుంద‌న్నారు.

విశాఖ ఉక్కు భూముల్లో వాటా కొట్టేసేందుకే
వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ ప్రజలకు ఏం అభివృద్ధి చేసిందో చూపించాలని అచ్చెన్నాయుడు స‌వాల్ విసిరారు. ప‌న్నులు, నిత్యావసరాల ధరలు, గ్యాస్, పెట్రోల్ ధ‌ర‌లు పెంచేసి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే నీటి పన్నులు మాఫీ చేస్తామని, ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామని అచ్చెన్న హామీఇచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మార్చి 5న జరిగే బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్ర బంద్‌ను టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ ఉనికికే ప్రమాదమని హెచ్చ‌రించారు. విశాఖ ఉక్కు క‌ర్మాగారానికి చెందిన భూముల్లో వాటా కొట్టేసేందుకే వైసీపీ మొసలికన్నీరు కారుస్తోందన్నారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని ఓడించి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందామని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: