మ‌న దేశంలో రాజ్యాంగ బద్ద‌మైన ఉన్నత పదవుల్లో ఉన్న‌వారి రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఉపయోగిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. భారత రాష్ట్రపతి వాహనం ఈ తరహాలో చాలా పటిష్టంగా తయారు చేస్తారు. అంతే కాకుండా ప్రతి దేశం కూడా త‌మ దేశ రాష్ట్ర‌ప‌తులు, ఇత‌రుల‌కు ఈ రకమైన రక్షణను కల్పించడానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఒక కీల‌క నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్రంలో ఉన్న కేబినెట్ మంత్రులకు మరియు రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారులకు త్వరలో కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు రానున్నాయి.

జగన్ సర్కార్ బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాల కోసం రూ. 6.75 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారుల సలహా మేరకు ప్రస్తుతం 10 కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల కొనుగోలుకు ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేసింది. వీటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6.75 కోట్లు కేటాయించింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుద‌లైంది. ఆంధ్రప్రదేశ్ లోని ఉన్నతాధికారుల వినియోగంలోకి రానున్న మొత్తం 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో ఐదు మహీంద్రా స్కార్పియోలు మిగిలిన ఐదు టాటా హెక్సా వాహనాలున్నాయి.  ఇందులో ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో కోసం 65 లక్షలరూపాయలు,  ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ టాటా హెక్సా  కోసం రూ. 70 లక్షల‌ చొప్పున ఖర్చు చేయనున్నారు.

రాష్ట్రంలో ఇప్పుడు వినియోగంలో ఉన్న వాహనాలతో రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రులు ఉన్న‌తాధికారుల దృష్టికి తెచ్చారు. అంతే కాకుండా పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో తలెత్తిన ఇబ్బందుల కారణంగా ఓ మంత్రి అనారోగ్యానికి గురైన‌ట్లు స‌మాచారం. ఇప్పటికే మంత్రుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదులు, ఉన్నతాధికారుల సలహాతో ప్రస్తుతమున్న పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను భర్తీ చేయడానికి రాష్ట్రప్రభుత్వం సుముఖత చూపింది. కొత్తగా రానున్న ఈ 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి, కొంతమంది మంత్రులకు పోలీస్ శాఖలోని కొంతమంది ఉన్నతాధికారుల రక్షణకు ఉపయోగించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: