కొవిడ్-19 పేరు ప్రపంచం మొత్తం మారుమోగిపోయిన వేళ.. ఇప్పుడు కొత్తగా దానికి పి-1 అనేది జతకలవబోతోందనే వార్తలు అందర్నీ కలవరపెడుతున్నాయి. అయితే ఇది ప్రపంచాన్ని గడగడలాడిస్తుందా, లేక కేవలం బ్రెజిల్ కే పరిమితం అవుతుందా అనే విషయం తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి బ్రెజిల్ లో పి-1 టైప్ కరోనా వేరియంట్ అక్కడ ఉధృతంగా వ్యాపిస్తోందని అంటున్నారు.

అమెజాన్‌ రెయిన్ ఫారెస్ట్ ‌లో పి-1 టైప్ కరోనా వేరియంట్ ఉనికి మొదటగా కనిపించింది. ఆ తర్వాత అది 17 రాష్ట్రాలకు వ్యాపించింది. 10 ఇతర దేశాల్లో కూడా ఈ పి-1 టైప్ కరోనా కనిపించిందని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ కరోనా వేరియంట్ బ్రెజిల్ లోనే ఎక్కువ ప్రభావం చూపిస్తోందని తెలుస్తోంది. అసలు కరోనా కంటే ఇలా ఉత్పరివర్తనం చెందిన రకం ఎక్కువగా వ్యాప్తి చెందడం మరింత ఆందోళన కలిగించే అంశం.

బ్రెజిల్ లో కొత్త రకం కరోనాతో ఆస్పత్రిబారిన పడుతున్నవారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతోంది. 19 రాష్ట్రాల్లో ఐసీయూలు పి-1 టైప్ కరోనా బాధితులతో నిండిపోయాయి. మిగతా దేశాలతో పోల్చుకుంటే బ్రెజిల్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం కాడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని అక్కడి ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. చైనా తయారీ కరోనావాక్‌, ఆక్స్‌ ఫర్డ్ టీకాలను బ్రెజిల్ లో వినియోగిస్తున్నారు. ఈ టీకాలను రెండు డోసులుగా ప్రజలకు అందించాల్సి ఉంటుంది. జనవరిలో అక్కడ వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు 70లక్షలమందికే టీకా ఇచ్చారు. బ్రెజిల్ జనాభా 21కోట్లలో వీరి శాతం చాలా తక్కువ.

మరోవైపు రోజువారీ మరణాలు కూడా బ్రెజిల్ ని వణికిస్తున్నాయి. ఒక్కరోజులోనే 1,910 మంది వైరస్‌కి బలయ్యారు. మొత్తంగా మరణాల పరంగా ఆ దేశం,  ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అమెరికాలో 5 లక్షల 31వేల 652 మంది మృత్యువాత పడగా, బ్రెజిల్ ‌లో ఇప్పటి వరకు 2లక్షల 59వేల 402 మంది కరోనా కారణంగా చనిపోయారు. ఇప్పుడు కొత్తరకం వేరియంట్ పి-1 బ్రెజిల్ ని వణికిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: