బాలీవుడ్ తార‌ల ఇళ్ల‌పై ఐటీ రైడ్స్ జ‌ర‌గ‌డం కొత్తేమీ కాదు. అయితే వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా, రైతుల‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడిన తార‌ల‌ను టార్గెట్‌గా చేసుకుని ఇన్‌కం ట్యాక్స్ దాడులు జ‌రుగుతున్నాయ‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాప్సీ ప‌న్ను, ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ఇళ్ల‌పై ఐటీ దాడులు ఈకోవ‌లోకే వ‌స్తాయ‌న్న అభిప్రాయం చాలామంది వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. అయితే కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను త‌ప్పుబ‌డుతూ గ‌తంలో చాలామంది బాలీవుడ్ న‌టులు త‌మ మ‌నోగ‌తాన్ని పంచుకున్నారు. ట్విట్ట‌ర్ ద్వారా కూడా రైతుల ఉద్య‌మానికి ప్ర‌జ‌లంతా మద్ద‌తివ్వాల‌ని కోరిన వారూ ఉన్నారు. ఇందులో పంజాబ్ నేప‌థ్యం ఉన్న న‌టులు కూడా ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం.


ఈ రైడ్‌ల‌తో కేంద్ర ప్ర‌భుత్వం అలాంటి వారిలో భ‌యం పెంచేందుకే ఇలాంటి రైడ్‌లు చేపిస్తోంద‌న్న వాద‌న ఉంది. ఇందులో ఎంత మేర‌కు వాస్త‌వం ఉంద‌న్న విష‌యం మ‌రి కొద్దిరోజులు ఆగితే గాని తెలియ‌రాదు. ఇదిలా ఉండ‌గా  నటి తాప్సీతో పాటు అనురాగ్‌ కశ్యప్‌, వికాస్‌ బెహల్‌, మధు మంతెన సహా పలువురు ప్రముఖుల ఇళ్లతో పాటు కార్యలయాల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో అధికారులు ఈ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అనురాగ్‌ కశ్యప్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఫాంటమ్‌ సంస్థ లక్ష్యంగా ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాల్లో అనేక అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ముంబై, పుణె, హైదరాబాద్‌, ఢిల్లీ నగరాల్లో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

 
గ‌తంలొ శాండ‌ల్‌వుడ్ కూడా షేక్ అయ్యింది.  సోదాల్లో భారీ ఎత్తున ఆస్తులు, బంగారం పట్టుబడింది. ఏకంగా రూ. 109 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, 25 కేజీల బంగారం పట్టుబడింది.  ప్రముఖ హీరోలు శివరాజ్‌కుమార్, ఆయన తమ్ముడు పునీత్‌ రాజ్‌కుమార్, తాజా హిట్‌ మూవీ కేజీఎఫ్‌ హీరో యశ్, మరో సీనియర్‌ హీరో కిచ్చ సుదీప్‌ల నివాసాలు, వారి బంధువుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు.  నిర్మాతలు రాక్‌లైన్‌ వెంకటేశ్, సీఆర్‌ మనోహర్, విజయ్‌ కిరంగదూరు, డిస్ట్రిబ్యూటర్‌ జయణ్ణ ఇళ్లపైనా దాడులు నిర్వహించారు. భారీ బడ్జెట్‌ చిత్రాల నిర్మాణం, వాటి కలెక్షన్‌లు, పన్ను ఎగవేత అనుమానాల వల్లే ఐటీ అధికారులు సోదాలకు పాల్పడినట్లు శాండల్‌వుడ్‌లో చర్చించుకుంటున్నారు. ఈ కేసులో విచార‌ణ కొన‌సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: