ఏపీలో తెలుగుదేశం పార్టీకి కాస్తో కూస్తో ఆశ ఉన్న మున్సిపాల్టీల్లో ఆ పార్టీ కంచుకోట హిందూపురం ఒక‌టి. ఇక్క‌డ ఎన్నిక‌ల‌కు ముందు నుంచే వైసీపీ ఫుల్ స్వింగ్‌లో ఉంది. నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ మ‌హ్మ‌ద్ ఇక్బాల్‌, ఉర‌వ‌కొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఇద్ద‌రూ క‌లిసి వైసీపీకి భారీగా కౌన్సెల‌ర్ల‌ను ఏక‌గ్రీవం చేయాల‌ని అనుకున్నారు. కేసుల‌తో పాటు ఎన్నో ఒత్తిళ్లు చేశారు. అయితే బాల‌య్య స్వ‌యంగా రంగంలోకి దిగి ఇక్క‌డే మ‌కాం వేశారు. బాలయ్య అండతో నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ససేమిరా అనడంతో వైసీపీకి షాక్ త‌ప్ప‌లేదు.

మున్సిపాల్టీలోని మొత్తం 38 వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులకు ధీటుగా టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలోనే తిష్ఠవేయడంతో అధికార వైసీపీ ఎత్తులు పార‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను బాల‌య్య పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీంతో మొత్తం 38 పంచాయ‌తీల‌కు గాను వైసీపీ ఏకంగా 30 పంచాయతీల‌ను గెలుచుకుంది. దీంతో మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా ఏంటో చాటుకోవాల‌ని బాల‌య్య స్వ‌యంగా పురంలో మకాం వేయ‌డంతో టీడీపీ శ్రేణుల్లో ఎక్క‌డా లేని ధైర్యం వ‌చ్చింది.

ఇందుకోసం బాల‌య్య ముందు నుంచే ప‌క్కా ప్లానింగ్‌తో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆరు రోజుల ముందే తన ప్రతినిధులైన శ్రీనివాసరావు, సురేంద్రనాథ్‌లను హిందూపురంలో మకాం వేయించారు. షూటింగ్‌ల లో ఆయ‌న ఎంత బిజీగా ఉన్నా స్థానిక నేత‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ఫోన్లో మాట్లాడుతూ వారికి స‌ల‌హాలు .. సూచ‌న‌లు చేశారు. అభ్యర్థులెవరూ విత్‌డ్రా చేసుకోకుండా స్థానిక నేతలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. ఏదేమైనా అధికార పార్టీ నేత‌లు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా బాల‌య్య మొత్తం 38 వార్డుల్లో పార్టీ అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌డంతో పాటు అక్క‌డ గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: