పెట్రోలు, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు ఇంధన ధరలు పరుగందుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు  రోజూ 25 పైసలో 30 పైసలో ధరలను చమురు కంపెనీలు పెంచుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు  రోజురోజుకు ఆకాశాన్నంటుతూ వాహనదారుల గుండెల్లో బాంబులు  పేల్చుతున్నాయి. ప్రస్తుతం పెట్రోలు ధర 100కు చేరువ కావడంతో వాహనాలను బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అయితే పెట్రో ఉత్పత్తులు మనం తయారు చేసేవి కావు.. ఎక్కువగా మనం వీటిని దిగుమతి చేసుకుంటాం. అందుకే ఈ ధరలు మన చేతుల్లో ఉండవు.


కానీ.. ఈ చమురు ఉత్పత్తుల్లో ఎక్కువగా పన్నులే ఉంటాయి. అసలు పెట్రో ఉత్పత్తుల ధరలకంటే ఇవి ఎన్నో రెట్లు ఉంటాయి. పన్నులు తగ్గించుకోవాలని సామాన్యుల నుంచి నిపుణుల వరకూ కోరుతున్నారు. అయితే ఈ పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే దేశంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 75కు దిగొస్తుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇందుకు రాజకీయ నాయకులు సిద్ధంగా లేరు. అందువల్లే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి.


పెట్రోలియం ఉత్పత్తులపై విధించే వ్యాట్, పన్నులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఆదాయవనరులు. అందువల్లే చమురు ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం, రాష్ట్రాలకు సుముఖంగా లేవు. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రవాణా ఛార్జీలు, డీలర్‌ కమిషన్‌, ఎక్సైజ్‌ సుంకం, సెస్‌, వ్యాట్‌ ఇలా పలు రకాల పన్నులు, ఛార్జీలు విధిస్తున్నాయి. లీటర్‌ పెట్రోల్‌పై రవాణా ఛార్జీలు రూ. 3.82, డీలర్‌ కమిషన్‌ రూ. 3.67, సెస్‌ రూ.30గా ఉంది. ఇక డీజిల్‌పై రవాణా ఛార్జీలు రూ. 7.25, డీలర్‌ కమిషన్‌ రూ. 2.53, సెస్‌ రూ. 20గా ఉంది. ఒక వేళ వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే అత్యధికంగా 28శాతం పన్ను ఉంటుంది. చమురు ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రాలకు నష్టం తప్పదు. కానీ ఇలా తెస్తే మాత్రం వినియోగదారులపై రూ.30 వరకు భారం తగ్గుతుంది. అప్పుడు లీటర్‌ పెట్రోల్‌ రూ. 75, లీటర్‌ డీజిల్‌ రూ. 68కే వస్తుంది. ఇదీ ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: