పెట్రోల్‌.. ఈ సమాజాన్ని నడిపించే ఇంధనం.. ఇది లేకపోతే.. ఏ బండీ కదలదు. దేశ ఆర్థక రథం నడవదు. కానీ..ఇది మన దగ్గర పెద్దగా దొరకదు. అందుకే దిగుమతులే గతి. ప్రస్తుతం పెట్రోలు ధర 100కు చేరువైంది. డీజీల్ పరిస్థితీ దాదాపు అంతే.. అందుకే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ పెట్రో ధరలప్రభావం మిగిలిన అన్ని రంగాలపైనా పడుతోంది. క్రమంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అయితే పెట్రో ఉత్పత్తులు మనం తయారు చేసేవి కావు.. ఎక్కువగా మనం వీటిని దిగుమతి చేసుకుంటాం. అందుకే ఈ ధరలు మన చేతుల్లో ఉండవు.


కానీ.. ఈ పెట్రో ఉత్పత్తులు మన దేశానికి తక్కువ ధరకే వస్తాయి. కానీ వీటిపై కేంద్రం, రాష్ట్రాలు విధించే పన్నులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పెట్రో ఉత్పత్తులపై అనేక రకాల పన్నులు ఉంటాయి. ఉదాహరణకు రవాణా ఛార్జీలు, డీలర్‌ కమిషన్‌, ఎక్సైజ్‌ సుంకం, సెస్‌, వ్యాట్‌ ఇలా పలు రకాల పన్నులు, ఛార్జీలు ఉంటాయి. ఇందులో కొన్ని కేంద్రం విధిస్తే.. మరికొన్ని రాష్ట్రం విధిస్తుంది.


ఒక్క లీటర్‌ పెట్రోల్‌పై రవాణా ఛార్జీలు రూ. 3.82, డీలర్‌ కమిషన్‌ రూ. 3.67, సెస్‌ రూ.30గా ఉంది. ఇక డీజిల్‌పై రవాణా ఛార్జీలు రూ. 7.25, డీలర్‌ కమిషన్‌ రూ. 2.53, సెస్‌ రూ. 20గా ఉంది. ఈ లెక్కలన్నీ చూస్తే ఒక లీటర్ పెట్రోల్‌పై 68 రూపాయల వరకూ పన్నులే ఉన్నాయి.. అంటే అసలు పెట్రోల్‌ ధర కేవలం దాదాపు 30 రూపాయలే అన్నమాట. అయితే ఈ విషయంపై కేంద్ర, రాష్ట్రాలు ఎందుకు పట్టించుకోవు.. ఎందుకంటే.. వాటి ఆదాయం తగ్గుతుంది కాబట్టి.


సాధారణ పరిస్థితుల్లో అంటే అనుకోవచ్చు. కానీ కొవిడ్ కారణంగా జనం చేతుల్లో డబ్బుల్లేక విలవిల్లాడుతున్నా.. పాలకులు మాత్రం పన్నులతోనే ఖజానా నింపుకునేందుకే ఉత్సాహం చూపుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఈ పన్నులు కొంత వరకూ తగ్గించుకుని కాస్త ఊరట ఇస్తున్నారు. కేసీఆర్, జగన్ మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: