ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొత్త‌లో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్‌రెడ్డి శాసనమండలిని రద్దు చేయాలని  భావించారు. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అటువంటి జగన్ ఇప్పుడు అకస్మాత్తుగా తన వ్యూహం మార్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగే అవకాశాలు ఉండటంతో అభ్యర్థులను బరిలోకి దింపి గెలిపించుకోవ‌డంతోపాటు ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించారు.

మండ‌లిలో పై చేయి దిశ‌గా..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహం మార్చారు. శాసన మండలిలో పైచేయి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. మే నెలకల్లా బలం పెంచుకుని శాసనసభతోపాటు శాసనమండలిలో కూడా పూర్తిస్థాయి బలంపెంచుకోవడానికి సిద్ధమయ్యారు. తాజాగా వైఎస్సార్సీపీకి ఆరుగురు ఎమ్మెల్సీలు రావడంతో ముఖ్యమంత్రితోపాటు ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా ఆనందం వెల్లివిరుస్తోంది. జగన్ ఈ ఆరుగురికి బీ ఫారాలు అందజేసి  అభినందనలు తెలిపారు.. పోటీ చేసే అవకాశం కల్పించినందుకు వారంతా ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్, కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్, చల్లా భగీరథరెడ్డి, కళ్యాణ చక్రవర్తి ఉన్నారు.

పెద్ద‌ల స‌భ‌ను రాజ‌కీయ‌గా వాడుకున్న చంద్ర‌బాబు
మండలిలో బలాన్ని చూసుకుని.. సాంకేతిక కారణాలు చూపుతూ అభివృద్ధిని టీడీపీ అడ్డుకుంటూ వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వచ్చే మే నాటికి మండలిలో వైఎస్సార్సీపీకి పూర్తిస్థాయి మెజార్టీ ఖాయమన్నారు. జగన్ చేసే అభివృద్ధి పనులకు ఉభయ సభల్లోనూ మద్దతు లభిస్తుంందన్నారు. పెద్దల సభను ఐదేళ్ల నుంచి రాజకీయ వేదికగా చంద్రబాబు వాడుకున్నారని సి.రామచంద్రయ్య మండిపడ్డారు. శాసన మండలి ప్రతిష్ఠ తగ్గిపోయిందని.. దాన్ని పెంచేందుకు కృషి చేస్తామన్నారు. వైఎస్సార్సీపీకి బలం పెరిగే అవకాశాలు ఉండటంతో అభ్యర్థులను బరిలోకి దింపారు. గతంలో ముగ్గురికి, ఇప్పుడు మరో ఆరుగురికి అవకాశం దక్కింది. మొత్తం తొమ్మిదిమంది పెద్దల సభకు వెళ్లడంతో వైఎస్సార్సీపీ బలం రోజురోజుకూ పెరుగుతోంది. మేనాటికి ఆ పార్టీ ఎమ్మెల్సీలతో పూర్తిస్థాయి మెజార్టీని శాసనమండలిలో దక్కించుకోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: