రోజురోజుకూ న‌రాలు తెగిపోతున్నాయి. ఉత్కంఠ పెరిగిపోతూనే ఉంది.. ఎన్నిక‌ల్లో సీటు వ‌స్తుందో?  రాదో?  తెలియ‌ని ప‌రిస్థితి.. అస‌లు మ‌నం పార్టీలోనే ఉన్నామా? మ‌న పార్టీని వేరే పార్టీ ఏమ‌న్నా న‌డుపుతోందా? అనే అనుమానం.. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు, కొత్త‌గా సీట్లు ఆశిస్తున్న ఆశావ‌హుల వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి.

రోజురోజుకూ పెరుగుతున్న ఉత్కంఠ‌
త‌మిళ‌నాడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి. అధికార అన్నాడీఎంకేలో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సీటు వస్తుందో రాదోనని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అభ్యర్థుల జాబితా వచ్చాక పార్టీలో పరిస్థితి ఎలా వుంటుందోనని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.  సీటు రాని అభ్యర్థులు  టీటీవీ దినకరన్‌ చెంతకు చేరడం ఖాయమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’ పార్టీ తరఫున పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వడంతో పాటు ఎన్నికల్లో అయ్యే వ్యయాన్ని దిన‌క‌ర‌న్ భ‌రిస్తార‌ని చెప్ప‌డం వారిలో భ‌రోసాను నింపుతోంది. సీట్ల ఖ‌రారు పూర్త‌య్యేవ‌ర‌కు వేచిచూద్దామ‌ని, రాన‌ప్పుడు దిన‌క‌ర‌న్ చెంత‌కు చేర‌దామ‌నే ఆలోచ‌న‌లో అన్నాడీంకే మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు ఉండ‌టం గ‌మ‌నార్హం.

45 మంది సిట్టింగులకు సీట్లు లేవు
2016 ఎన్నికల్లో 227 స్థానాల్లో పోటీ చేసిన అన్నాడీఎంకేకు 136 మంది ఎమ్మెల్యేలు ద‌క్కారు. అయితే ఈసారి ఎన్నికల్లో వీరిలో చాలామందిని పక్కనబెట్టినట్టు తెలుస్తోంది. మొత్తం 45 మందికి సీటు ఇవ్వడం లేదని తెలిసింది. ఇందులో ఐదుగురు మంత్రులు కాగా, అందులోనూ ముగ్గురు మహిళలున్నట్టు ఎడప్పాడి వర్గీయులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి ఒక నిర్ణయానికి వచ్చిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత్రి జయలలిత జీవించి ఉన్న‌ప్పుడు ఇంటర్వ్యూలు జరిపిన తీరును పార్టీ నేత‌లు గుర్తుచేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న ఆశావహుల జాబితాను తెప్పించుకునే జయలలిత.. అందులో నలుగురైదుగురి గురించి వాకబు చేయించి సీటు ఇచ్చేవారు. ఈ ప‌ద్ధ‌తి ఇప్పుడున్న‌వారు అనుస‌రిస్తారో?  లేదో?  తెలియ‌ద‌ని పార్టీవ‌ర్గాలే అంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: