విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికలలో అటు అధికార పార్టీ, ఇటు విపక్ష తెలుగుదేశం పోటీ పడి మరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి.  మేయర్ పీఠం తమదే కావాలని రెండు పార్టీలు చేస్తున్న విసృత ప్రచారంతో సాగర నగరం హోరెత్తిపోతోంది. విశాఖలో ఎటు చూసినా ఇపుడు ఎన్నికల సందడే కనిపిస్తోంది.

గెలుపు మాదే, అన్ని సీట్లూ మేమే గెలుచుకుంటామని అధికార పార్టీ వైసీపీ ఓ వైపు జబ్బలు చరుస్తోంది. మొత్తం 98 వార్డులకు గానూ ఏకంగా 75కు పైగాగానే వైసీపీ గెలుస్తుంది అని అంటున్నారు. వైసీపీ గాలి విశాఖలో బలంగా వీస్తోందని, జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షే పధకాలే వైసీపీని గెలిపిస్తాయని కూడా ఆ పార్టీ నాయకులు ధీమాగా చెబుతున్నారు.  మరో వైపు చూస్తే టీడీపీ కూడా విశాఖలో తమకే అనుకూల గాలి వీస్తోందని చెబుతోంది. తాము విశాఖ మేయర్ సీటుని గెలుచుకోవడం తధ్యమని కూడా అంటోంది. విశాఖ మొదటి నుంచి టీడీపీకి కంచుకోట అని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అంటున్నారు. విశాఖలో పసుపు జెండా ఎగరడం ఖాయమని ఆయన చెబుతున్నారు. మెజారిటీ సీట్లు తాము గెలుచుకుని వైసీపీకి గట్టి గుణపాఠం చెబుతామని కూడా హెచ్చరిస్తున్నారు.

మరి ఈ రెండు పార్టీలు తమకు తాముగా విశాఖ మాదే అని క్లెయిం చేసుకుంటున్నాయి. కానీ విశాఖలో పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఎవరికి అనుకూలం అంటే ఇప్పటిదాకా చూస్తే స్లమ్ ఏరియాలు, రూరల్ బేస్డ్ ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికల పట్ల అసక్తి కనిపిస్తోంది. సిటీలో మాత్రం రాజకీయ పార్టీలను ఎన్నికలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు. మరి పోలింగునకు సిటీ జనం వస్తారా ఓటేస్తారా అన్నది కూడా  చూడాలి. ఇక నగర వాసులల్లో మాత్రం రాజకీయ పార్టీల పట్ల పెద్దగా ఆదరణ కనిపించడం లేదన్నది వాస్తవం. రాజకీయ పార్టీల తీరుతో జనం విసిగిపోయారా అన్నది కూడా చర్చకు వస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: