తెలుగు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ముడిప‌డివున్న విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు అడుగులు నెమ్మ‌దిగా ప‌డుతున్నాయి. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హ‌క్కు అంటూ నిన‌దించిన తెలుగోడి గుండెచ‌ప్పుడును కేంద్ర ప్ర‌భుత్వం బేఖాత‌ర్ చేస్తోంది. ఒక‌వైపు రాష్ట్రంలో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి.. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి అయినా కేంద్ర ప్ర‌భుత్వానికి ఇవేమీ ప‌ట్ట‌వు. తాను అనుకున్న‌దే చేస్తుంది. చేయిస్తుంది.

దాత‌ల ఔదార్యంతో సోకులు
విశాఖ‌ప‌ట్నం ఉక్కు క‌ర్మాగారానికి న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో వేల ఎకరాల భూములున్నాయి. ప్లాంట్‌ ఉన్న ప్రాంతంలోనే 6 వేల ఎకరాలకు పైగా దాతలిచ్చిన భూమి ఉంది. ఉద్యోగుల క్వార్టర్స్‌, అనుబంధ భవనాల రూపంలో పలు చోట్ల భూములఉన్నాయి. వీటిలో నగరంలోని మద్దెలపాలెం, సీతమ్మధార ప్రాంతాలకు చేరువలో 22.19 ఎకరాల భూమి ఉంది. ఇందులో ప్రస్తుతం ఉద్యోగుల క్వార్ట్రర్స్‌ ఉన్నాయి. దీన్ని అభివృద్ధి చేసి ప్రైవేటీకరణలో భాగంగా చేపట్టే ప్లాంట్‌ విక్రయంలో చేర్చాలని కేంద్రం యోచిస్తోంది. దీని విలువ ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.1540 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా. త‌మ ప్రాంతంలో క‌ర్మాగారం స్థాపించి ఉద్యోగాలిస్తామ‌న్నార‌ని ఎంద‌రో దాత‌లు త‌మ సొంత భూముల‌ను ఆరోజుల్లో ప్ర‌భుత్వానికి ఉచితంగా అప్ప‌గించారు. న‌రేంద్ర‌మోడీ ఆధ్వ‌ర్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న విశాఖ ఉక్కు ప్ర‌యివేటీక‌ర‌ణ నిర్ణ‌యం వారి ఆశ‌యాన్ని, వారి ల‌క్ష్యాన్ని చిదిమేస్తోంది.

26నే కుదిరిన ఒప్పందం
ఫిబ్రవరి 26న జాతీయ భవన నిర్మాణ కార్పోరేషన్ (ఎన్‌బీసీసీ)తో   కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ నగరంలో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల క్వార్టర్స్‌ భూమిని అభివృద్ధి చేసి తర్వాత విక్రయించేలా గత నెల 26నే కేంద్ర ప్రభుత్వం, ఎన్‌బీసీసీ మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రం తరఫున స్టీల్‌ ప్లాంట్‌ అధికారులు ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను ఎన్‌బీసీసీ బ‌య‌ట‌పెట్ట‌డంతోనే అంద‌రికీ తెలిసింది. గతంలో 830 క్వార్టర్లను ఇక్కడ ఉద్యోగుల కోసం నిర్మించారు. దాదాపుగా ఇవ‌న్నీ శిథిలావ‌స్థ‌‌కు చేరుకున్నాయి. ఇందులో 130 క్వార్టర్లను మ‌ర‌మ్మ‌తులు చేయించుకుని ఉద్యోగులే ఉంటున్నారు. వీటిని పూర్తిగా పడగొట్టేసి వాణిజ్య స‌ముదాయాల‌తోపాటు నివాసాలు కూడా నిర్మించేందుకు ఎన్‌బీసీసీ కేంద్రంతో ఒప్పందం చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: