టీడీపీ వయసు నాలుగు దశాబ్దాలు. ఎన్నో రాజకీయ యుద్ధాలను చూసింది. ఎంతగానో ఆరితేరింది. ఢక్కామెక్కీలు తిన్నది. ఇప్పటికీ పల్లెల్లో టీడీపీ సైకిల్ గుర్తు తప్ప తెలియని జనాలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంటువంటి టీడీపీకి 2019 ఎన్నికలు చావు దెబ్బ కొట్టాయి. అలా ఇలా కాదు, భవిష్యత్తు మీదనే నీలి నీడలు కమ్మేలా చేశాయి.

టీడీపీ తిరిగి బతికి బట్టకడుతుందా అన్న సందేహాలు ఇపుడు  తమ్ముళ్ళను వెంటాడుతున్నాయంటే దానికి ఆ ఘోర పరాజయమే కారణం. ఇదిలా ఉంటే మునిసిపాలిటీ ఎన్నికల్లో మరో మారు టీడీపీని ఓడించడం ద్వారా 2019 ఎన్నికల్లో విజయాన్ని పదిలం చేసుకుందామని వైసీపీ కొత్త ఎత్తులు వేస్తోంది. దాంతో విశాఖ జిల్లాలో టీడీపీ కంచుకోట అయిన నర్శీపట్నం మునిసిపాలిటీని ఎలాగైనా కైవశం చేసుకోవాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది.

ఒక్క నర్శీపట్నమే ఎందుకు టార్గెట్ చేయాలి అంటే అక్కడే అసలైన రాజకీయ లెక్క ఉంది అంటున్నారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు బలమంతా అక్కడే ఉంది. అయ్యన్న పాత్రుడు తాత ముత్తాత‌ల నుంచి నర్శీపట్నం పంచాయతీగా ఉన్నప్పటి నుంచి వారి ఏలుబడిలోనే ఉంది. ఇక నర్శీపట్నం మునిసిపాలిటీ కనుక చేతిలో ఉంటే రేపటి రోజున మరో మారు అసెంబ్లీ సీటుని గెలుచుకోవచ్చు అన్నది వైసీపీ ఎత్తుగడ.

నర్శీపట్నంలో ఎవరికి మెజారిటీ వస్తే వారిదే ఎమ్మెల్యే సీటు అన్నది లెక్క ఉంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ కి నాలుగు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. దాంతో కచ్చితంగా నర్శీపట్నం కంచుకోటను బద్ధలు కొట్టడానికి వైసీపీ అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తోంది. ఈసారి కనుక వైసీపీ విజయం సాధిస్తే ఇక టీడీపీ అక్కడ ఆశలు వదిలేసుకోవాల్సిందే అంటున్నారు మరి చూడాలి ఈ హోరాహోరీ యుద్ధంలో ఎవరు విజేతలో మరెవరు పరాజితులో అన్నది.

.

 

మరింత సమాచారం తెలుసుకోండి: