ఏపీలో సత్తా చాటాలని చూస్తున్న బీజేపీకి చెందిన అభ్యర్ధులు మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్లు ఉపసంహరించుకున్న ఘటన ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా జిల్లాల నేతల వైఖరి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లాలో బీజేపీ సంస్థాగతంగా బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. నిజానికి రాష్ట్ర నాయకత్వం కూడా ఈ జిల్లా అనే కాక అన్ని జిల్లాల నేతలకు ముందు నుంచి అదే విషయాన్ని చెబుతూ సిద్దం చేస్తూ వస్తున్నారు. అయితే స్థానిక నాయకత్వ లోపమో ఏమిటో తెలియదు గానీ క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తీ భిన్న పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజే పార్టీ మద్దతుదారులకు ఒక్క సర్పంచ్‌ స్థానం కూడా దక్కలేదు. 

వార్డు సభ్యుడిగా కూడా ఆ పార్టీ మద్దతుదారులు గెలుపొందిన దాఖలాల్లేవు. పంచాయతీ ఎన్నికలు పార్టీలతో, గుర్తులతో ప్రమేయం లేకుండా జరిగాయనే అనుకున్నా తాజాగా మున్సిపల్‌ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతున్నవే. జిల్లాలోని అనంతపురం కార్పొరేషన్‌తో పాటు 8 మున్సిపాల్టీలు, రెండు నగర పంచాయతీలతో కలిపి మొత్తం 358 డివిజన్లు, వార్డులకు సంబంధించి గత ఏడాది మార్చిలో నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 358 డివిజన్లు, వార్డులకు గాను భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 116 నామినేషన్లు దాఖలు చేశారు.

కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడటంతో తాజాగా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడం తెలిసిందే. ]మొత్తం 116 నామినేషన్లు బీజేపీ తరపున దాఖలుకాగా... అందులో 37 ఉపసంహరించుకున్నారు. 79 వార్డుల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైసీపీ ఏకగ్రీవాల కోసం ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులపై ఎక్కువ ఫోకస్ చేసింది. కానీ.. బీజేపీ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి. అలాంటిది బీజేపీ వాళ్ళు కూడా విత్‌డ్రాలు చేసుకోవడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టడం లేదన్న అనుమానాలు ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: