అనుకున్నంతా అయింది. ఉక్కు ఆందోళనలో వైసీపీ, టీడీపీ నేతలు ఎవరికి వారే మైలేజీకోసం ప్రయత్నించారు. టీడీపీ వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపించగా, జగన్ చీకటి ఒప్పందం వల్లే విశాఖ ఉక్కు పోస్కో పరమైందంటూ టీడీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో టీడీపీ వేసిన ఫ్లెక్సీలు వివాదానికి కారణం అయ్యాయి. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఉక్కు ఆందోళనలో తుక్కు రేగ్గొట్టుకున్నారు.

కృష్ణా జిల్లా కైకలూరులో టీడీపీ వేసిన ఫ్లెక్సీ ఆందోళనకు దారి తీసింది. ఉక్కు నిరసనలో భాగంగా కైకలూరులో టీడీపీ, వైసీపీ, వామపక్షాలు బంద్ ‌లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో అఖిలపక్ష ఆందోళనలో ఒకే పార్టీ ప్లెక్సీ ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. టీడీపీ ఇన్ ‌ఛార్జి జయమంగళ వెంకట రమణ చేతిలో ఉన్న ప్లెక్సీని వైసీపీ కార్యకర్తలు చించేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రెండు వర్గాలను అదుపు చేశారు. వైసీపీ శ్రేణుల తీరును నిరసిస్తూ జయమంగళ వెంకటరమణ, టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈఘటనతో కైకలూరులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పోస్కోతో జగన్ చీకటి ఒప్పందంపై నిరసన దీక్ష అంటూ టీడీపీ వేసిన ఫ్లెక్సీ అసలు గొడవకు కారణం అయింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి, తమపై బురదజల్లాలనుకోవడం సరికాదంటూ వైసీపీ శ్రేణులు ఆ ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. అక్కడితో ఆగకుండా దాన్ని చింపేశాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారణం మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. చివరకు పోలీసులు కలుగజేసుకోవడంతో ఇరు వర్గాలు శాంతించాయి. గతంలో బంద్ లంటే ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిపోయేవి. ఇప్పుడు బంద్ లో పాల్గొన్న రెండు వర్గాలు గొడవకు దిగడంతో నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: