ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాలతో బాటుగా హైదరాబాద్ కు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలకు కీలక సూచనలు చేసారు. టీఆర్ఎస్  పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది అని ఆయన అన్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విస్తృతంగా మూడు జిల్లాల్లో పర్యటిస్తూ విద్యావంతులను కలుస్తూ బరిలో ముందు వరుసలో ఉన్నారని తెలిపారు.

మూడు జిల్లాలకు సంబంధించిన పార్టీ శ్రేణులంతా పల్లా  రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం గట్టిగా పని చేస్తున్నారని  అభినందించారు. ఒక్క నల్గొండ జిల్లాకే 3 వైద్య కళాశాలలు వచ్చాయన్నారు ఆయన. వరంగల్ నగరానికి పెట్టుబడులతో పాటు ఐటీ పరిశ్రమ పెట్టుబడులు వస్తున్నాయి అని వివరించారు. ఖమ్మం నగరంలో ఐటీ టవర్ ప్రారంభించుకున్నాం అని వివరించారు. ఈ మూడు జిల్లాల్లో యువకుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం టాస్క్ ఏర్పాటు చేశామని, మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎస్. వాణిదేవి అభ్యర్థిత్వానికి ప్రత్యర్థుల నుంచి సైతం సానుకూల స్పందన వస్తుందని తెలిపారు.    

టీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ గారి నాయకత్వంలో  హైదరాబాద్ నగరం గత ఏడు సంవత్సరాలలో అద్భుతమైన ప్రగతిని సాధించిందని అన్నారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన నగర అభివృద్ధిని నగర విద్యావంతుల దృష్టికి తీసుకుపోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచనలు చేసారు. ప్రతి ఒక్క ఓటర్ ని నేరుగా కలిసి టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని విజ్ఞప్తి చేసారు. ఉద్యోగాల కల్పన విషయంలో బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు. మన ప్రభుత్వం వచ్చినాక 1,33,000 ఉద్యోగాలు ఇచ్చాం అని ఆయన తెలిపారు.  మరో 50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయబోతున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: