ఎన్నికల కోసం ఎన్ని ప్రత్యేక అంశాలు ఎపుడూ ఉంటాయి. వాటితో పాటే మరికొన్ని కూడా సిద్ధం చేసుకుని ప్రత్యర్ధుల మీదకు ఆయుధాలుగా వాడుతారు. విశాఖ వరకూ చూస్తే తెలుగుదేశాన్ని కార్నర్ చేయడానికి వైసీపీ అసలైన అస్త్రం బయటకు తీసింది. నిజానికి గ్రేటర్ విశాఖ ఎన్నికల కధ మొదలయ్యాక ఇప్పటిదాకా ఆ అంశం తెరమీదకు రాకపోవడమే ఆశ్చర్యం.

ఈ మధ్యన  విశాఖ  స్టీల్ కార్మికలకు సంఘీభావం ప్రకటించడానికి నగరానికి  వచ్చిన చంద్రబాబుకు విశాఖ రాజధాని అంశం పెద్ద సమస్య కాలేదు. కానీ గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తాజాగా వస్తే మాత్రం బాబుకు మళ్ళీ అదే ఎదురైంది. విశాఖ రాజధానికి అనుకూలమని చెప్పి బాబు విశాఖలో అడుగుపెట్టాలని ఉత్తరాంధ్రా బీసీ సంఘాల‌ పేరిట బాబు సభలో నినాదాలు చేయడం సంచలనం అయింది. మరో వైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే చంద్రబాబుని ఉత్తరాంధ్రా ద్రోహిగా అభివర్ణించారు. చంద్రబాబు విశాఖ రాజధానిని అడ్డుకున్నారని కూడా ఆయన మండిపడ్డారు. విశాఖ అభివృద్ధిని చూడలేని పార్టీ తెలుగుదేశం అంటూ నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే విశాఖను భూకబ్జాల నగరంగా టీడీపీ తయారుచేసిందని కూడా సాయిరెడ్డి పదునైన బాణాలే వేశారు.

తాము విశాఖను ప్రశాంత నగరంగా, అందమైన సిటీగా చేయాలని భావిస్తున్నామని కూడా ఆయన చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే విశాఖ రాజధాని విషయాన్ని వైసీపీ మళ్ళీ సీన్ లోకి తెచ్చి టీడీపీని ఇరకాటంలో పెట్టాలని మాస్టర్ ప్లాన్ వేసింది. విశాఖలో పర్యటిస్తున్న చంద్రబాబుకు ఇది ఇబ్బందికరమైన వ్యవహారమే. ఆయన అటు అమరావతిని వదులుకోలేరు, ఇటు విశాఖకు ఓకే అని చెప్పలేరు. మరి చూడాలి  మునిసిపాలిటీ ఎన్నికల్లో  రాజధాని రాజకీయం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో. అదే విధంగా విశాఖ జనాలకు రాజధాని మీద కనుక కోరిక ఉంటే వైసీపీకి ఈ ఎన్నికలు బాగా ప్లస్ అవుతాయని కూడా విశ్లేషణ వినవస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: