తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడే.. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు కేసీఆర్ ధైర్యం లేదన్నారు. ప్రధాని మోడీ అంటే కేసీఆర్‌కు చలి జ్వరమని వ్యంగ్యాస్త్రం సంధించారు రేవంత్ రెడ్డి.  ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లిలో నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్, మోడీ ఒకే నాణేనికి బొమ్మాబొరుసని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఐటీఐఆర్‌ రాలేదని కేటీఆర్‌ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ఆ ప్రాజెక్టు కోసం ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర ఆమరణ దీక్ష చేద్దామని రేవంత్ పిలుపునిచ్చారు. కేటీఆర్‌కు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. లక్షా 91వేల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న మోడీతో ఎందుకు జతకట్టాడో కేసీఆర్ చెప్పాలన్నారు. విజ్ఞులైన పట్టభద్రులు ఆలోచించి ఓటు వేసి.. తమ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డిని గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి.  

ఉద్యోగాలు ఇస్తామని మోడీ, కేసీఆర్ ప్రజలను మోసం చేశారని రేవంత్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి మంజూరైన ఐటీఐఆర్‌ను రద్దు చేశారని ఆయన ఆరోపించారు. ఖాజీపేటకు ఇస్తానన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాలను తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు రేవంత్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో రాములు నాయక్ , హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో చిన్నారెడ్డిని గెలిపించాలని పట్టభద్రులు, ఉద్యోగులను కోరారు ఎంపీ రేవంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: