తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. తెలంగాణ‌కు నిధుల కేటాయింపులో కేంద్ర ప్ర‌భుత్వం వివ‌క్ష చూపుతోంద‌న్న రీతిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఐఐ సదస్సు వేదికగా కేంద్రం ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.  తెలంగాణ రాష్ట్రానికి గ‌డిచిన ఆరున్నరేళ్లలో ఒక్క ప్రాజెక్టూ ఇవ్వని విష‌యాన్ని గుర్తు చేశారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులపై ఇప్పటి వరకు ఒక్క అడుగూ ముందుకు పడలేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను అమలు పర్చలేకపోయారన్నారు. ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా గొప్ప నినాదాలని, ప్రధాని టీమ్ ఇండియా అంటూ గొప్పగా చెబుతుంటారని కానీ ఆచరణలో అవి కనిపించవన్నారు.


భారత్‌లో అందుబాటులోకి రానున్న బుల్లెట్ ట్రైన్స్‌పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుల్లెట్ ట్రైన్ గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు అర్హత లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏ ఒక్క రాజకీయ నేత అయినా ఎన్నికల కోసం కాకుండా ప్రజల కోసం, దేశం కోసం పని చేయాలని ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండ‌గా బుల్లెట్ ట్రైన్  ప్రాజెక్టుకు సంబంధించిన   రైలు చిత్రాన్ని జపాన్ రాయబార కార్యాలయం మొదటి సారిగా విడుదల చేసింది. ముంబై-అహ్మదాబాద్ మధ్య నడువనున్న ఈ ఫైవ్ సిరీస్ సింకాన్సిన్ రైలింజన్ కొన్ని మార్పులు చేయనున్నట్లుగా అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.


ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య 508కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్ట్ 2023నాటికల్లా పూర్తి చేయాల్సి ఉంది. సుమారు లక్షా ఎనిమిదివేల కోట్ల రూపాలయ ఈ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వ సాంకేతిక, ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం ప్రత్యేకమైన మార్గం నిర్మించాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలో భూ సేకరణ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుతం గుజరాత్ పరిధిలోని 325కిలోమీటర్ల మార్గంలోనే ఎల్ అండ్ టీ పనులు చేపట్టనుంది. మహారాష్ట్రలో భూసేకరణలో సమస్యలు ఉన్నందున దాంతో సంబంధం లేకుండా గుజరాత్‌లో పనులు ప్రారంభించాలని ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: