పెరుగుతున్న పెట్రో ధ‌ర‌లతో సామాన్యులు విల‌విల‌లాడిపోతున్నారు. ర‌వాణాతో సంబంధం ఉన్న ప్ర‌తీ రంగం బెంబెతెత్తిపోతోంది. క్యాబ్‌, ఆటో, ట్రాన్స్‌పోర్టు కంపెనీలు, వాహ‌న‌దారులు, ప్రైవేటు ఉద్యోగులు ఇలా ప్ర‌తీ ఒక్క‌రూ ఆగ‌మాగ‌మ‌వుతున్నారు. పెట్రోల్ ధ‌ర‌లు దాదాపు 100కి చేరువ‌లో ఉండ‌టం సామాన్యుల‌ను హ‌డ‌లెత్తిస్తోంది. ఏం అడిగినా బండి అడ‌గ‌కు బాసు అంటూ సున్నితంగా హెచ్చ‌రిస్తున్నారు. అలా ఉంది ప‌రిస్థితి మ‌రి. ఫిబ్రవరి 21 నాటికి ఈ నెలలో పెట్రోల్, డీజిల్ రేట్లు 14 రెట్లు పెరిగినట్లుగా గణాంకాంలను బట్టి తెలుస్తున్నది. ఈ సమయంలో ఢిల్లీలో పెట్రోల్ రూ.4.03, డీజిల్ రూ.4.24 పెరిగింది. అంతకుముందు జనవరిలో రేటు 10 రెట్లు పెరిగింది. ఈ సమయంలో పెట్రోల్ ధరను రూ.2.59, డీజిల్ రూ.2.61 పెంచారు. 2021 లో ధరలు 52 రోజుల్లో 24 రెట్లు పెరిగాయి. పెట్రోల్ ధర రూ.6.77, డీజిల్ రూ.7.10 పెరిగింది.


ఈ విష‌యం ఇలా ఉంచితే పెట్రోల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు క్రుడాయిల్ ధ‌ర‌ల పెరుగుద‌లే కార‌ణ‌మే అయిన‌ప్ప‌టికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా వ్యాట్ రూపంలో ప‌న్నులు పిండుకోవ‌డం విస్మ‌రించ‌లేం. పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.  ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఐడబ్ల్యూపీసీ ప్రెసర్‌లో ఆమె మాట్లాడారు.   పెట్రోల్‌పై కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా పన్నులు వేస్తున్నాయని అన్న ఆమె కేంద్ర రాష్ట్రాల మధ్య చర్చలు మంచి ఫలితాలు ఇవ్వవచ్చని ఆశించారు. ‘‘పెట్రోల్ ధరల పెరుగుదల అనేది కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ఒక్క కేంద్ర ప్రభుత్వమే పన్నులు వేస్తోందని అనుకోవద్దు, రాష్ట్రాలు కూడా పెట్రోల్‌పై పన్నులు వేస్తున్నాయి. పెట్రోల్‌పై కేంద్రానికి వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు 41 శాతం వెళ్తుంది. దీనిపై కేంద్ర రాష్ట్రాల మధ్య చర్చలు జరగడం అవసరమంటూ  పేర్కొన‌డం గ‌మ‌నార్హం.


ఇదిలా ఉండ‌గా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడం లేదు. ఢిల్లీని ఉదాహరణగా తీసుకుంటే, లీటరు పెట్రోల్‌పై రూ.32.90, డీజిల్‌పై రూ.11.80 ఎక్సైజ్ సుంకం విధిస్తున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విధిస్తున్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్‌పై రూ.20.61 వ్యాట్ ఉండటం గమనించాల్సిన విషయం. రాజస్థాన్‌ ప్రభుత్వం 2 శాతం వ్యాట్ తగ్గించగా.. అసోం ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, మేఘాలయ రూ.2,  పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం రూ.1 వ్యాట్‌ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: