ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల హీట్ పెరిగింది. సోమవారంతో ప్రచార గడువు ముగియనుండటంతో పార్టీల నేతలు, అభ్యర్థులు స్పీడ్ పెంచారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో ప్రచారం నిర్వహించారు.  పెందుర్తి నుంచి ర్యాలీ ప్రారంభించిన చంద్రబాబు.. చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం, ఎన్‌ఏడీ మీదుగా ముందుకు వెళ్లారు. కంచరపాలెం, తాటిచెట్లపాలెం మీదుగా అక్కయ్యపాలెం వరకు రోడ్‌షో నిర్వహించారు. రోడ్ షో నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు.

విశాఖలోని పెందుర్తి కూడలిలో ప్రసంగించిన చంద్రబాబు.. వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. విశాఖ భూములను కబ్జా చేయడం కోసమే కొందరు నేతలు ఇక్కడ తిరుగుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్ల పాటు తాను సీఎంగా ఉన్నప్పుడు విశాఖను ఆర్థిక రాజధానిగా చేసేందుకు ఎంతో కృషి చేశానని చెప్పారు.హుదూద్ తుపాను సమయంలో 10 రోజులు విశాఖలోనే ఉన్నానని... నగరం మళ్లీ సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే తిరిగి వెళ్లానని చంద్రబాబు  తెలిపారు. విశాఖ ప్రజలు టీఢీపీకి ఘన విజయాన్ని కట్టబెట్టాలని కోరారు.జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును ప్రకటించారు చంద్రబాబు. పీలా శ్రీనివాస్ మేయర్ కావడం ఖాయమని... ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

అయితే చంద్రబాబు పర్యటించిన ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ప్రాంతంలో  వీధి దీపాలు వెలగలేదు. లైట్ల వెలుగకపోవడంతో రోడ్లు చీకటిమయమయ్యాయి. వైసీపీ నేతల ఆదేశాలతోనే విద్యుత్ అధికారులు కరెంట్ నిలిపివేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. తొలి రోజు విశాఖలో ప్రచారం ముగించిన చంద్రబాబు.. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేశారు.  శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జీవీఎంసీ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. చంద్రబాబు ప్రచారంతో విశాఖ తమ్ముళ్లకు కొత్త ఉత్సాహం వచ్చిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: