లంచం..లంచం.. లంచం.. ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ పని కోసం పోయినా అడిగే మొదటి మాట ఇది. ఇక కాస్తో కూస్తో లాభాలు వచ్చే పనులైతే.. అధికారులకు వాటాలు తప్పనిసరి. అయితే.. ఓ సర్పంచ్ ఏకంగా 15 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన కలకలం రేపింది. సాధారణంగా ఎమ్మార్వోలు.. ఇతర రెవెన్యూ అధికారులు భారీ స్థాయిలో లంచాలు తీసుకుంటారని టాక్ ఉంది. కానీ.. హైదరాబాద్ శివార్లలో చివరకు సర్పంచ్‌లు కూడా లంచాల కోసం వేధిస్తున్నారని ఈ ఘటనతో మరోసారి వెల్లడైంది.

అసలేం జరిగిందంటే..  వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మన్నెగూడ ఓ భూస్వామికి దాదాపు 100 ఎకరాల పొలం ఉంది. అది కూడా మన్నెగూడ చౌరస్తా సమీపంలో. ఇన్నాళ్లూ పంటలు పండింటిన ఈ యజమాని ఇప్పుడు ప్రధాన రహాదారిపై వున్న భూమి‌లో షట్టర్లు వేయిస్తున్నాడు. వరుసగా 20 షట్టర్లు వేయించేందుకు రెడీ అయ్యాడు. ఈ విషయం గ్రామ సర్పంచ్‌కు తెలిసింది. షట్టర్లు వేయాలంటే పంచాయతీ అనుమతులు తీసుకోవాలని సర్పంచ్ డిమాండ్ చేశాడు.

ఈ అనుమతుల కోసం ఏకంగా 20 లక్షలు డిమాండ్ చేశాడు. ఎంత బతిమాలినా ఫలితం లేకపోవడంతో చివరకు అతన్ని ఏసీబీకి పట్టివ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకే 15 లక్షలు ఇస్తానంటూ బేరం కుదుర్చుకున్నాడు. ఈ రోజు 13 లక్షల రూపాయలు ఇస్తూ.. ముందుగానే ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. రాజేంద్రనగర్‌ సమీపంలోని షాదాన్ కళాశాల వద్దకు డబ్బు ఇస్తామని సర్పంచ్‌ను రమ్మని భూ యజమాని ఫోన్‌ చేశాడు.

షాదాన్ కళాశాల వద్ద ఓ కారులో డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో మొత్తం మీద సర్పంచ్ పై కేసు నమోదైంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఊపందుకుంటున్న రియల్ ఎస్టేట్‌ కార్యకలాపాలతో ఇలాంటి అవినీతి దందాలు సాధారణంగా మారాయి. ఇటీవల తక్కువ సమయంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల రెవెన్యూ గ్రామాల్లోని సర్పంచ్‌లు, వారి బంధువులు ఏసీబీకి చిక్కారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: